Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

మల్లోజుల, అశన్న లొంగుబాటుపై మావోయిస్ట్ పార్టీ స్పందన

ఛత్తీస్ గఢ్: పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోను, తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ సతీష్ టీంల లొంగుబాటు పర్వంపై మావోయిస్ట్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈమేరకు ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో నాలుగు పేజీల పత్రికా ప్రకటన విడుదలైంది. మల్లోజుల, ఆశన్న టీంల లొంగుబాటును విప్లవ ద్రోహంగా, పార్టీ విచ్ఛిన్నకర చర్యగా, విప్లవ ప్రతీఘాతుకతగా అభివర్ణించింది. ప్రాణభీతి గలవారు ఎవరైనా లొంగిపోదల్చుకుంటే లొంగిపోవచ్చని, కానీ పార్టీకి, విప్లవ ప్రజలకు చెందిన ఆయుధాలను శత్రువుకు అప్పగించకూడదన్నారు. ఈ చర్య విప్లవ ద్రోహమేకాక, విప్లవ ప్రతిఘాతుకత అవుతుందన్నారు. ఇటువంటి కార్యకలాపాలను ఇకనైనా ఆపాలని సోను, సతీష్ లను హెచ్చరిస్తున్నట్లు పేర్కొన్నారు.

పధ్నాలుగేళ్ల క్రితమే.. 2011 నుంచి గడ్డు స్థితిని ఎదుర్కుంటూ వచ్చిన దండకారణ్య విప్లవోద్యమం, దేశవ్యాప్త విప్లవోద్యమం 2018నాటికి తాత్కలిక వెనుకంజకు గురైనట్లు అభయ్ పేర్కొన్నారు. దండకారణ్య విప్లవాచరణలోని కొన్ని లోపాలపై స్వీయాత్మక విశ్లేషణతో కూడిన నిర్ధారణలు చేస్తూ ఒక పత్రాన్ని 2020 డిసెంబర్ లో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో మల్లోజుల అలియాస్ సోను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. అయితే దాన్ని కేంద్ర కమిటీ తిరస్కరించిందన్నారు. ఆ తర్వాత కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో సమావేశాల్లో పలుసార్లు సోనులోని తప్పుడు రాజకీయ భావాలను విమర్శించి, సరిదిద్దడానికి కృషి చేసినట్లు అభయ్ చెప్పారు. సోనులోని వ్యక్తివాదాన్ని, అహంభావాన్ని, తీవ్రమైన పెత్తందారీతనాన్ని తీవ్రంగా విమర్శించి, వాటిని సరిదిద్దుకోవాలని కోరామన్నారు. గత మే నెలలో జరిగిన కగార్ దాడిలో పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు చనిపోయిన తర్వాత సోనులో దీర్ఘకాలంగా పేరుకుపోయిన సైద్ధాంతిక, రాజకీయ, నిర్మాణ బలహీనతలు గుణాత్మక మార్పును సంతరించుకుని శత్రువు ముందు మోకరిల్లేలా చేశాయన్నారు.

అంతేగాక నిరుడు చివరిలో తన జీవిత సహచరి, మరికొందరిని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో పోలీసులకు లొంగిపోవడానికి పథకం రూపొందించినప్పటి నుంచే సోను పోలీసు ఉన్నతాధికారులతో, మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సంబంధాలను కలిగి ఉన్నట్లు ఇటీవలి పరిణామాల ద్వారా అర్థమవుతోందన్నారు. ఆశన్న అలియాస్ సతీష్ కూడా ఛత్తీస్ గఢ్ పోలీసులతో సంబంధాలు ఏర్పరచుకుని కోవర్టుగా మారినట్లు ఇటీవల పరిణామాలను బట్టి అర్థమవుతోందన్నారు. విప్లవ తత్వాన్ని కోల్పోయి, విప్లవ ద్రోహిగా, పార్టీ విచ్ఛిన్నకరకుడిగా, విప్లవ ప్రతీఘాతకునిగా మారిన సోనును, ఆయనతో కలిసి శత్రువుకు లొంగిపోయినవారిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు అభయ్ ప్రకటించారు. విప్లవ ద్రోహానికి పాల్పడినవారికి తగిన శిక్ష విధించాల్సిందిగా ప్రజలకు పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈరోజు సోను, సతీష్ లు, రేపు మరొకరు సరెండరైనా పార్టీ మాత్రం శత్రువుకు లొంగిపోదని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నట్లు అభయ్ ప్రకటించారు.

Popular Articles