ఛత్తీస్ గఢ్ అడవుల్లో మావోయిస్టుల ఆయుధ తయారీ ఫ్యాక్టరీని కనుగొన్న భద్రతా బలగాలు దాన్ని ధ్వంసం చేశాయి. సుక్మా జిల్లా మెట్టుగూడ క్యాంప్ అడవుల్లో మావోయిస్టుల ఆయుధ తయారీ కర్మాగారం ఉందనే సమాచారంతో భద్రతా బలగాలు శనివారం గాలింపు చర్యలు చేపట్టాయి. ఎరాపల్లి, కోయిమెంట గ్రామాల సమీపంలోని దట్టమైన అడవుల మధ్య గల కొండలలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఇక్కడ నక్సలైట్ల ఆయుధ తయారీ ఫ్యాక్టరీని కనుగొని దాన్నిభద్రతా బలగాలు ధ్వంసం చేశాయి.
పోలీసు అధికార వర్గాల కథనం ప్రకారం.. స్వాధీనం చేసుకున్న ఆయు సామాగ్రిలో ఒక నిలువు మిల్లింగ్ యంత్రం, రెండు BGL (బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్), 12 ఖాళీ BGL షెల్స్, 94 BGL హెడ్స్, ఒక హ్యాండ్ గ్రైండర్ మెషిన్, ఆరు చెక్క రైఫిల్ బట్స్, ఒక ట్రిగ్గర్ మెకానిజం (మజిల్-లోడర్ కోసం) ఉన్నాయి. అదేవిధంగా పిస్టల్ గ్రిప్‌తో కూడిన ఒక ట్రిగ్గర్ మెకానిజం, నాలుగు సోలార్ బ్యాటరీలు, ఒక బోర్‌వెల్ డ్రిల్లింగ్ బిట్ (10 అడుగులు), రెండు గ్యాస్ కట్టర్ హెడ్స్, మూడు డైరెక్షనల్ IED (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్) పైపులు, ఆరు మెటల్ మోల్డింగ్ పాట్స్, ఆరు ఇనుప కట్టర్ వీల్స్, 80 స్టీల్ పైపు ముక్కలు (BGL కోసం), పెద్ద మొత్తంలో ఇనుప స్క్రాప్‌లు, ఇతర వస్తువులు ఉన్నాయని అధికార వర్గాలు వివరించాయి.


