Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

జాతరకు ముందే మేడారానికి సీఎం.. ఇదీ అసలు టార్గెట్!

మేడారం: మహా జాతర సమయంలో ఏ ముఖ్యమంత్రి అయినా మేడారం వస్తారు. జాతర సమయంలోనూ కొందరు సీఎంలు అటువైపు కన్నెత్తి చూడలేదనేది వేరే విషయం. కానీ జాతరకు ముందే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటనకు వస్తుండడం ముఖ్య వార్తాంశంగా మారిందనే చెప్పాలి. జాతర సమయంలో భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు ఏ ప్రభుత్వమైన నిధులు సమకూరుస్తుంది. కానీ ఈ జాతరకు ముందే ప్రస్తుత ప్రభుత్వం ఓ భారీ లక్ష్యాన్ని ఎంచుకోవడం కోట్లాది మంది సమ్మక్క-సారలమ్మ భక్తులు సంతోషించే అంశమే. తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి జాతరకు దాదాపు నాలుగు నెలల ముందే మేడారం పర్యటనను ఎంచుకుని, వనదేవతలు కొలువై ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు సమాయత్తం కావడం విశేషం.

వచ్చే జనవరి 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరిగే మహా జాతర సందర్భంగా మేడారంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై స్థానికంగానే సమీక్షకు సీఎం స్థాయి నాయకుడు తరలిరావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మహాజాతర పనుల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 150 కోట్లను కేటాయించింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం మేడారంలో పర్యటిస్తున్నారు. ఈమేరకు ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆసియా ఖండంలోనే అతి పెద్ద‌దైన మేడారం జాత‌ర‌ను ఈసారి మ‌రింత ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం న‌డుం బిగించింది.

సీఎం పర్యటనలో భాగంగా మేడారంలో సిద్ధమైన సభా వేదిక

ఇప్పటి వరకు వివిధ సంవత్సరాల్లో జరిగిన మేడారం జాత‌ర‌ సందర్భాల్లో ప్ర‌భుత్వాలు తాత్కాలిక ఏర్పాట్లు మాత్రమే చేస్తున్నాయి. జాతర నిర్వ‌హ‌ణ‌పై స‌మీక్ష‌కు సైతం గ‌తంలో ముఖ్య‌మంత్రులు పెద్దగా శ్ర‌ద్ధ చూపేవారు కాదు. తొలిసారిగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మేడారం జాత‌ర ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టిని సారించడం గమనార్హం. మేడారం పూజ‌రులు, ఆదివాసీ పెద్ద‌లు, మంత్రులు, గిరిజ‌న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇత‌ర ప్ర‌ముఖుల‌తో జాత‌ర నిర్వహణ, కొత్త నిర్మాణాల‌పై ముఖ్యమంత్రి మంగళవారం మేడారంలో స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు.

ఆదివాసీ సంప్ర‌దాయాల‌కు పెద్ద పీట వేస్తూ, వారి ఇల‌వేల్పులైన స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ‌, ప‌గిడిద్ద‌రాజు, గోవింద‌రాజుల గ‌ద్దెలున్న ప్రాంగణాన్ని లక్షలాది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా మేడారంలో భారీ ఎత్తున అభివృద్ధి ప‌నుల‌కు ప్ర‌భుత్వం శ్రీ‌కారం చుడుతోంది. కోట్లాది మంది భ‌క్తులు తరలి వ‌చ్చే జాత‌ర ప్రాశ‌స్త్యానికి త‌గ్గ‌ట్లు భారీ ఎత్తున స్వాగ‌త తోర‌ణాల నిర్మాణంతో పాటు గ‌ద్దెల వ‌ద్ద‌కు భ‌క్తులు సులువుగా చేరుకోవడం, గ‌ద్దెల ద‌ర్శ‌నం, మొక్కుబడుల బంగారం (బెల్లం) స‌మ‌ర్ప‌ణ‌, జంప‌న్న వాగులో స్నానాలచరించేందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేయ‌నున్నారు. మేడారం అభివృద్ధి ప‌నుల్లో గిరిజ‌న సంప్ర‌దాయాలు, విశ్వాసాల‌కు ఎటువంటి భంగం క‌ల‌గ‌వ‌ద్ద‌నే కృత‌నిశ్చ‌యంతో ప్రభుత్వం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

మేడారంలో పోలీసులు భద్రతా ఏర్పాట్ల చిత్రం

నిర్మాణాల్లో విలువైన గ్రానైట్‌, లైమ్‌స్టోన్ రాళ్ల‌ను వాడ‌నున్నారు. పురాత‌న ఆల‌యాల పునఃనిర్మాణం, ప్ర‌సిద్ధ ఆల‌యాల్లో అభివృద్ధి ప‌నుల్లో ప్ర‌సిద్ధుడైన స్తప‌తి ఈమ‌ని శివ‌నాగిరెడ్డి సేవ‌ల‌ను మేడారం అభివృద్ది ప‌నులకు ప్ర‌భుత్వం వినియోగించుకుంటోంది. అయితే మేడారం జాతర అంశంలో గత ప్రభుత్వాల వైఖరికి భిన్నంగా ప్రస్తుత సర్కారు అడుగులు వేస్తుండడం వెనుక అసలు లక్ష్యం వేరే దాగి ఉండడం విశేషం. ప్రస్తుతం మేడారంలో వనదేవదల గద్దెల రూపురేఖలు మార్చడం, భారీగా విస్తరణ చేపట్టడం, భక్తులు చేరుకోవడానికి కొత్త మార్గాలను నిర్మించడం వంటి అనేక పనులను ప్రభుత్వం ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ప్రస్తుతం మేడారానికి భక్తులు చేరుకునేందుకు రెండు, మూడు ప్రధాన మార్గాలు ఉన్నాయి. పస్రా, తాడ్వాయి, భూపాలపల్లి నుంచి ప్రధాన మార్గాలు ఉండగా, పస్రా నుంచి కొత్తనాగారం, ముత్తాపురం, మొట్లగూడెం, పడిగాపురం మీదుగా అటవీ ప్రాంతం నుంచి జాతర సమయంలో ఏర్పాటయ్యే ప్రత్యేక బస్ స్టేషన్ వరకు చేరే విధంగా మరో ప్రధాన మార్గాన్ని నిర్మించేందుకు ప్రణాళికను రూపొందించినట్లు తెలుస్తోంది. మేడారం రూపురేఖల మార్పుల్లో ఇదో ప్రధాన అంశం కాగా, ఇటువంటి అనేక ఇతర అంశాలతో మేడారం అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ ను రూపొందించారు. వచ్చే మహా జాతరకు ముందే పనులను పూర్తి చేయడం ద్వారా మేడారానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించనున్నారు. రాష్ట్రపతిని మేడారానికి తీసుకువచ్చే అంశంలో మంత్రి సీతక్క ప్రత్యేక బాధ్యతలను నిర్వహించనున్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎలాగైనా జాతరకు తీసుకువచ్చి, ప్రస్తుతం రాష్ట్ర పండుగగా ఉన్నటువంటి జాతరను ఎన్నో ఏళ్లుగా పెండింగులో గల ‘జాతీయ పండుగ’గా మార్చేందుకు కృషి చేయడమే ప్రభుత్వ అసలు లక్ష్యంగా తెలుస్తోంది. జాతీయ పండుగగా కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే ఇక మేడారం మహాజాతర ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమిస్తుంది. మేడారం జాతరకు ‘జాతీయ పండుగ’ హోదా లక్ష్యంగా సాగుతున్నట్లు ప్రభుత్వ అడుగులకు ఫలితం లభిస్తే వనదేవతల జాతర ప్రాశస్త్యం ప్రపంచ స్థాయిలో మరింత ప్రాచుర్యం పొందడమే కాదు, అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక చేయూత కూడా లభిస్తుంది. ఫలితంగా మేడారం ప్రాంతం స్థానికులకే కాదు, స్థానికేతరులకూ ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడుతాయి. ఇప్పటికే నిత్య జాతరగా మారిన మేడారం అడవులు మున్ముందు ప్రతిరోజూ మహాజాతరగా మారే అవకాశముంది.

Popular Articles