ఖమ్మం: ఇటీవల తన అమెరికా పర్యటనలో అక్కడి ఆత్మీయులు, ఆప్తులు చూపిన ఆదరణను, అప్యాయతను మరువలేనని రాజ్యసభ షభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. అమెరికా పర్యటన ముగిసిన తర్వాత ఖమ్మం వచ్చిన వద్దిరాజు రవిచంద్రను నగర మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించుకున్నారు. స్థానిక బుర్హాన్ పురంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆకుల గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు మున్నూరు కాపు ప్రముఖులు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పలు రాజకీయ పార్టీలకు చెందిన మున్నూరు కాపు ప్రముఖుల సమక్షంలో ఆయనను భారీ గజమాల, శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ, ఇటీవల తన అమెరికా పర్యటనలో అక్కడి మున్నూరు కాపు బిడ్డలు చూపిన ఆదరణ, ఆప్యాయత ఎన్నటికీ మరువలేనని అన్నారు. కొద్ది రోజుల తన పర్యటనలో అందర్నీ కలవలేకపోయినందుకు బాధపడుతున్నానని చెప్పారు. అమెరికాలో స్థిరపడ్డ మున్నూరు కాపులంతా అక్కడ కమ్యూనిటీ అవసరాల కోసం భవనాలు నిర్మించాలని తాను చేసిన సూచనకు గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ తోపాటు అక్కడి కుల బంధువులందరూ ఆమోదించారని చెప్పారు. బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా మున్నూరు కాపులంతా ఐక్యమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైన మున్నూరు కాపులు ఇతరులను గౌరవించడంలో ఎప్పుడు ముందుంటారన్నారు. బీసీ కులాల్లోని ఇతర సామాజిక వర్గాలను కలుపుకొనిపోతూ మున్నూరు కాపు కులాన్ని కూడా బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు ప్రముఖులు మేకల భిక్షమయ్య, పారా నాగేశ్వరరావు, జాబిశెట్టి శ్రీనివాసరావు, కనకం జనార్ధన్, తోట రామారావు, శీలంశెట్టి వీరభద్రం, తోట వీరభద్రం, మాటేటి రామారావు, కాంగ్రెస్ నాయకులు పసుపులేటి వెంకట్, సీపీఐ నాయకులు మేకల శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు మేకల నాగేందర్, బీఆర్ఎస్ నాయకులు పిన్ని కోటేశ్వరరావు, యాసా రామారావు, గుళ్లపల్లి శేషగిరిరావు, ఎర్రా అప్పారావు, యూత్ నాయకులు తోట రమేష్, వివిధ నియోజకవర్గాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.


