Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

ఖమ్మం జిల్లా T న్యూస్ రిపోర్టర్ పై రైతు ఫిర్యాదు, కేసు నమోదు

బీఆర్ఎస్ పార్టీ గొంతుక టీ న్యూస్ ఖమ్మం జిల్లా రిపోర్టర్ సాంబపై కొణిజర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. కొణిజర్లకు చెందిన గంధం నాగరాజు అనే దళిత రైతు ఇచ్చిన ఫిర్యాదుపై రిపోర్టర్ పై కేసు నమోదు కావడం గమనార్హం. బీఎన్ఎస్ చట్టంలోని 151, 196, 353(2), రెడ్ విత్ 3(5), రెడ్ విత్ 62 సెక్షన్ల కింద సాంబపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశానికి సంబంధించి రైతు చేసిన ఫిర్యాదులోని పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తాను వ్యవసాయం చేస్తుంటానని, ఈనెల 11వ తేదీన ఉదయం 10 గంటల సమయంలో యూరియా బస్తాలకోసం కొణిజర్లలోని పీఏసీఎస్ కేంద్రానికి వచ్చి క్యూలో నిలబడి ఉండగా, టీ న్యూస్ ఛానల్ కు చెందిన రిపోర్టర్ సాంబ, అతని వీడియోగ్రాఫర్, మరో అసిస్టెంట్ ముగ్గురూ కలిసి అక్కడ ఉన్న రైతులతో ముఖాముఖి మాట్లాడుతూ, ప్రభుత్వం రైతులకు సరఫరా చేస్తున్న యూరియా అందరికీ సరిపడా ఉన్నా కూడా సక్రమంగా చేయడం లేదని, కాంగ్రెస్ పార్టీకి చెందినవారికి మాత్రమే ఇస్తున్నదని, బీఆర్ఎస్ పార్టీకి చెందినవారికి ఇవ్వడం లేదని, మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాకు వాయిస్ ఇవ్వండి అని కోరినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ధర్నాలు చేస్తామని చెప్పాలని, మీ మాటల ద్వారా ప్రభుత్వాన్ని బద్నాం చేద్దాం.. అని అక్కడ లైన్ లో ఉన్న రైతులకు చెబుతూ వారిని సాంబ రెచ్చగొట్టాడని నాగరాజు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే తాను మాత్రం ‘ఎందుకన్నా.. లైనులో ఉన్నవారందరికీ యూరియా బస్తాలు ఇస్తున్నారు కదా? అట్లా ఎందుకు చెప్పమంటున్నావు? అన్నప్పటికీ వినకుండా రైతులను రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే యూరియా బస్తాలు ఇస్తున్నారని, బీఆర్ఎస్ పార్టీ వాళ్లకి ఇవ్వడం లేదని చెప్పండని, తాను అది న్యూస్ లో టెలీకాస్ట్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఉపయోగిస్తానని, ఆ విధంగా చెప్పాలని సాంబ వాళ్లను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూశారని రైతు నాగరాజు తెలిపారు.

కొణిజర్లలోని పీఏసీఎస్ కేంద్రం వద్ద టీ న్యూస్ రిపోర్టర్ సాంబ (బ్లూ షర్ట్)

అందువల్ల యూరియా సరిపడా ఉన్నప్పటికీ, తప్పుడు వార్తలను బలవంతంగా రైతులతో చెప్పించి, దాన్ని టీ న్యూస్ ఛానల్ లో టెలీకాస్ట్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ఉపయోగించాలని చూసిన టీ న్యూస్ రిపోర్టర్ సాంబపై, ఆ ఛానల్ వీడియో గ్రాఫర్ పై, వాళ్లకు సహకరించిన మరో వ్యక్తి సహా మొత్తం ముగ్గురిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రైతు నాగరాజు కోరారు. ఈమేరకు కొణిజర్ల పోలీసులు క్రైం నెం. 259/2025 ద్వారా ఆయా సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Popular Articles