Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

ఏసీబీ వలలో చిన్న, పెద్ద చేపల కథ!

చిత్రంలో కనిపిస్తున్న రెండు దృశ్యాలను నిశితంగా గమనించండి. రాముడు మంచిబాలుడు తరహాలో నుదుటన బొట్టు పెట్టుకుని అమాయకంగా కనిపిస్తున్న ఇతని పేరు అమర్ నాథ్ రెడ్డి. రెవెన్యూ శాఖలో ఇన్స్ పెక్టర్ (ఆర్ఐ)గా పనిచేస్తుంటాడు. నారాయణపేట జిల్లా మద్దూరు తహశీల్దార్ ఆఫీసులో పనిచేసే అమర్ నాథ్ రెడ్డి ఓ ఐదు వేల రూపాయలను లంచంగా స్వీకరిస్తూ అవినీతి నిరోధకశాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అక్కడో, ఇక్కడో కాదు నేరుగా ఆఫీసులోనే ఇతను దొరికిపోయాడు. ఓ రైతుకు చెందిన పొలాన్ని అతని పట్టాదార్ పాస్ బుక్కులో నమోదు చేసేందుకు లంచం డిమాండ్ చేసి ఇలా దొరికిపోయాడన్నమాట. ఆ ఏముందిలే చిక్కింది చిన్న చేపే కదా.. అనుకుంటున్నారా?

అయితే రెండో ఫొటోను కూడా గమనించండి. పాపం తనకేమీ తెలియనట్టు రెండు చేతులూ జోడించి కాస్త దుఃఖిస్తున్నట్లు కనిపించడం లేదూ చిత్రంలో మేడమ్? ఈమె పేరు మణిహారిక. హైదరాబాద్ నార్సింగ్ మున్సిపల్ ఆఫీసులో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గా పనిచేస్తుంటారు. ఈ మేడం ఏం చేసిందో తెలుసా? మంచిరేవులకు చెందిన వినోద్ అనే వ్యక్తికి చెందిన ప్లాట్ కు సంబంధించి ఎల్ఆర్ఎస్ ను క్లియర్ చేసేందుకు రూ. 10 లక్షలు డిమాండ్ చేసింది. అడ్వాన్సుగా రూ. 4.00 లక్షలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు మేడమ్ మణిహారిక. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈమె లంచావతారాన్ని వలవేసి పట్టుకోవడంతో ఇలా సాక్షాత్కరించారు టీపీవో మణిహారిక. ఈ రెండు ఘటనలూ నిన్న ఒకే రోజు జరిగాయి.

ఏసీబీకి పట్టుబడ్డ ఆర్ఐ అమర్ నాథ్ రెడ్డి

నారాయణపేటలో ఏసీబీ వలకు చిక్కిన ఆర్ఐ అమర్ నాథ్ రెడ్డి అవినీతిలో చిన్న చేప.. మేడమ్ మణిహారిక మాత్రం చిన్న చేప కాదు సుమీ. ఎందుకంటే అమర్ నాథ్ రెడ్డి ఐదు వేలకు కక్కుర్తి పడితే, మేడమ్ మాత్రం రూ. 10.00 లక్షలు డిమాండ్ చేసి అడ్వాన్సుగా ఓ రూ. 4.00 లక్షలు మాత్రమే స్వీకరిస్తూ పట్టుబడ్డారు. పద్ధతి ప్రకారం ఏసీబీ అధికారులు వీళ్లను అరెస్ట్ చేయడం, రిమాండ్ కు తరలించడం చకచకా జరిగిపోయాయి. ఆ.. ఏముందిలే నాలుగు రోజులు జైల్లో కాలక్షేపం చేసి మళ్లీ వచ్చేస్తారుగా.. అనుకుంటున్నారా?

రూ. 4 లక్షలు లంచంగా స్వీకరిస్తూ పట్టుబడ్డ నార్సింగ్ టీపీవో మణిహారిక

ఓసారి ఏసీబీకి పట్టుబడ్డాక నిందితులైన ప్రభుత్వ అధికారుల పరిస్థితి అదో రకంగా ఉంటుందనే చెప్పాలి. కనిష్టంగా 30 రోజులు, గరిష్టంగా 45-60 రోజులపాటు జైల్లో మగ్గాల్సిందే. కేసు దర్యాప్తులో భాగంగా 164 స్టేట్ మెంట్ రికార్డు చేసే వరకు ఇటువంటి అవినీతి చేపలకు బెయిల్ లభించే అవకాశమే లేదు. జైల్లో గడిపే ఆయా రోజుల్లో ఒక్కో అధికారి ఒక్కోరకమైన బాధలను అనుభవిస్తుంటారు. ఆ బాధలేమిటనేది మరీ బహిరంగంగా చెప్పే వీలు కూడా ఉండదని అవినీతి కేసుల్లో అరెస్టయి బెయిల్ పై వచ్చిన అధికారులు వాపోతుంటారు. మరోవైపు అవినీతి చేపల ఆస్తులపైనా ఏసీబీ అధికారుల నిఘా నిరంతరంగా ఉంటుంది. అరెస్టయిన పరిణామాల్లో సస్పెన్షన్ కు గురవుతారు.. దీన్ని ఎన్నిరోజులకు ఎత్తివేస్తారో ఇతమిద్దంగా చెప్పలేని పరిస్థితి.

అందువల్ల చెప్పొచ్చేదేమిటంటే.. లక్షలకు లక్షలు లంచం డిమాండ్ చేసి పట్టుబడగానే ఇదే మొదటిసారి అని ఏడుపులంకించుకోవడం వల్ల ప్రయోజనం ఉండకపోవచ్చు. ఈ ఏడుపుకంటే లంచం తీసుకోకుండా విధులు నిర్వహిస్తే జైలుకెళ్లే పరిస్థితి ఉండదు కదా..? అని బాధితులు అంటున్నారు. అంతేకాదు ఏసీబీ వలకు చిక్కుతున్నది చిన్న చేపలైనా, పెద్ద చేపలైనా, సొర చేపలైనా, తిమింగలాలైనా.. అన్నింటికీ వర్తించే సెక్షన్ ఒక్కటే.. తీసుకునే మొత్తాన్ని బట్టి శిక్షలు ఉండవని, చట్టంలో నిర్దేశించిన సెక్షన్ ప్రకారమే శిక్ష ఉంటుందనేది న్యాయ నిపుణులు చెబుతున్న మాట. ఈ శిక్ష ఎన్నేళ్లకు పడవచ్చంటారా? కాస్త టైం తీసుకున్నప్పటికీ శిక్ష ఖాయమని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.

Popular Articles