వాతావరణ శాఖ సూచనల ప్రకారం అల్పపీడనం వల్ల రాష్ట్రంలో కురిసే భారీ నుంచి అతి భారీ వర్షాల వల్ల ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా అధికారులు పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, వ్యవసాయ శాఖల మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు ఆదేశించారు. హైదరాబాద్ సెక్రటేరియట్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం కలెక్టరేట్ నుంచి తుమ్మల నాగేశ్వరరావులు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
సచివాలయం నుంచి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, రెడు రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో కురుస్తున్నాయని అన్నారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం వరదల సమయంలో ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు. వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పారు. ప్రజలకు ఎక్కడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరద సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలకు ముందస్తుగా కోటి రూపాయల చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని, అవసరమైతే మరిన్ని నిధులు కూడా విడుదల చేస్తామని పొంగులేటి చెప్పారు.

వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు పరిహారం అందించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలని అన్నారు. వరద సహాయక చర్యల్లో పోలీసు యంత్రాంగం సహకారం పూర్తిస్థాయిలో తీసుకోవాలన్నారు. రోడ్లు, కాజ్ వే లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల డ్యామేజ్ ఉంటే వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. వైద్యపరంగా అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు, సిబ్బందికి ఎటువంటి సెలవులు ఇవ్వరాదని, సెలవుల్లో ఉన్న వారిని రీకాల్ చేయాలని మంత్రి సూచించారు.

ఉమ్మడి జిల్లాలకు ఒక ప్రిన్సిపల్ కార్యదర్శి స్థాయి అధికారిని నియమించి, పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. ఎక్కడైనా అనుకోని సంఘటనలు జరిగినట్లయితే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను వినియోగించాలన్నారు. వచ్చే వరద పరిస్థితి ముందుగా తెలుసుకుంటే, నష్ట నివారణ చర్యలు పకడ్బందీగా చేపట్టవచ్చన్నారు. ప్రభుత్వం ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనడానికి సన్నద్ధంగా ఉందన్నారు. కలెక్టర్ స్థాయిలో పరిష్కరించే సమస్యలు ఉంటే పరిష్కరించాలని, ఆపై ఉన్నతాధికారులకు పంపితే త్వరితగతిన పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని మంత్రి పొంగులేటి అన్నారు.
ఖమ్మం కలెక్టరేట్ నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇప్పటి వరకు సమస్యలు లేవన్నారు. ఆకేరు, మున్నేరు, పాలేరు, వైరా, లంకాసాగర్ లు నిలకడగా ఉన్నాయని, ప్రమాదకర స్థితిలో లేవన్నారు. పొరుగున ఉన్న మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో వర్షపాతాన్ని బట్టి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కోరారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించామన్నారు. రేపు, ఎల్లుండి వాతావరణ ప్రభావాన్ని బట్టి అప్రమత్తంగా ఉండాలన్నారు. కల్వర్టు లు, క్యాజ్ వేల దగ్గర ప్రజలు దాటకుండా చూడాలని, చెరువులను నిరంతరం పర్యవేక్షణ చేయాలని మంత్రి తుమ్మల అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణారావు, వివిధ జిల్లా కలెక్టర్లు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.