Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

మంత్రి పొంగులేటి అభిమానికి కత్తిపోట్లు

తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీరాభిమాని ఒకరు బీఆర్ఎస్ కార్యకర్త చేతిలో దారుణ కత్తిపోట్లకు గురయ్యాడు. పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సాయిగణేష్ నగర్ లో గత రాత్రి ఈ ఘటన జరిగింది. పొంగులేటి కార్యాలయం అందించిన వివరాల ప్రకారం.. సాయిగణేష్ నగర్ ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త మెడికంటి రాజవర్ధన్ రెడ్డి అలియాస్ అర్జున్ రెడ్డి మద్యం మత్తులో గురువారం రాత్రి ఆ కాలనీ సెక్రటరీ, కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుడు మెరుగు భాస్కర్‌తో అకారణంగా వాగ్వాదానికి దిగాడు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రభుత్వాల హయాంలో జరిగిన అభివృద్ధి అంశంలో ఇరువురి మధ్య ప్రారంభమైన వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారి తీసింది.

ఇదే క్రమంలో ఇద్దరి మధ్య గొడవను ఆపడానికి మంత్రి పొంగులేటి అభిమాని సుదర్శన్‌ ప్రయత్నించాడు. అయితే నువ్వెవడ్రా ఆపడానికి? అంటూ రాజవర్ధన్ రెడ్డి కత్తితో సుదర్శన్ పొట్టపై, వీపుపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. మొత్తం ఆరు కత్తిపోట్లతో సుదర్శన్‌కు తీవ్ర రక్తస్రావం కాగా, చికత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటన గురించి తెలుసుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇంఛార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ఆసుపత్రిలో సుదర్శన్ ను పరామర్శించారు. నిందితునిపై కఠిన చర్యలు తీసుకునేలా పోలీసులతో మాట్లాడతానని దయాకర్ రెడ్డి సుదర్శన్ కుటుంబానికి హామీ ఇచ్చారు. సుదర్శన్ కు మెరుగైన చికిత్స అందించాలని దయాకర్ రెడ్డి ఆసుపత్రి వైద్యులను కోరారు.

Popular Articles