అది కాంగ్రెస్ పార్టీ. మహా సముద్రం అది. మంత్రి పదవి కోసం భయపెడితే బెదిరే రకం కాదు. ప్రాంతీయ పార్టీలు కొంత బెట్టు సడలించుకుని భయపడతాయేమోగాని, జాతీయ పార్టీలు అస్సలు పట్టించుకోవు. క్రమశిక్షణ కలిగిన పార్టీగా ప్రాచుర్యం పొందిన బీజేపీ అయినా అంతే. ‘ప్రజాస్వామ్యం’ అతిగా ఉన్నట్లు భావించే కాంగ్రెస్ పార్టీ అయినా ఒక్కటే. ఇలాంటి విషయాల్లో రెండూ రెండే. అసలుకే మోసం జరగవచ్చు. ఎదురు దెబ్బ తగలవచ్చు.
విషయానికి వస్తే.. తుపానులా అప్పుడప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వం ఫై ఎదురు దాడి చేస్తుంటారు. మళ్ళీ చప్పున సైలెంట్ అయిపోతారు. ఉన్నట్టుండి ఉగ్ర రూపం దాల్చి మాటల దాడి చేస్తుంటారు. ఇదంతా కేవలం మంత్రి పదవి కోసమే. రోజుకో మాటల బాణం విసురుతున్నారు. అది కాంగ్రెస్ పార్టీ. భీష్మునిలా అలా బాణాలు తీసి విరిచేసి పక్కన పడేస్తుంటుంది. ఎన్ని రకాలుగా బెదిరిస్తే అన్ని రకాలుగా కష్టాలు ఎదురవుతాయి. బెదిరింపులకు భయపడిపోయి మంత్రి పదవులు ఇవ్వవు. అన్నదమ్ములు మంత్రులు కావడం వెనుక చాలా అరుదైన ఈక్వేషన్స్ ఉంటాయి. అందునా కాంగ్రెస్ పార్టీకి ఎంతో మేలు జరిగితే తప్ప బ్రదర్స్ కు మంత్రి పదవులు ఇవ్వరు. మహా అయితే ఒకరికి మంత్రి పదవి ఇస్తే, మరొకరికి క్యాబినెట్ ర్యాంక్ లో ఏదొక కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టొచ్చు. అంత వరకు కరెక్ట్ అని ఆ పార్టీ చరిత్ర చెబుతోంది.

పార్టీలు మారేటప్పుడు ఎన్నో హామీలు ఇస్తుంటారు. అది రాజకీయ చదరంగం. ఒక్కోసారి ఆ హామీలు నీటి మాటలు కావచ్చు! అంత మాత్రాన ఆ హామీ నిలబెట్టుకోండి.. అంటూ పదే పదే బెదిరించకూడదు. అసలుకే ఎదురు దెబ్బ తగలవచ్చు. ఇది ఒక రకమైన వ్యాపారం. ప్రభుత్వంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామనడం, ఎంపీని గెలిపిస్తే మంత్రిని చే..స్తా అనడం అప్పటికప్పుడు ఆక్సిజన్ లాంటివి. పార్టీ కోసం ఉత్సాహంగా పని చేసేందుకు నేతలకు రాసిచ్చే ప్రెస్క్రిప్షన్. బలం కోసం రాజకీయ నేతలకు తాగించే టానిక్! అంత మాత్రాన చిన్న పిల్లాడిలా నాకు చాకోలెట్ కావాలంటూ గుర్తొచ్చినప్పుడు బెదిరిస్తే ఆయనకే నష్టం. మంత్రిగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పని చేయాల్సిన నేత ఆ ముఖ్యమంత్రినే విమర్శిస్తుంటే ఆ ఈక్వేషన్ కుదిరే అవకాశం వుంటుందా? ఈ చిన్న లాజిక్ మరిచిపోతే ఎలా?
తీన్మార్ మల్లన్నా అంతే! ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి గెలిపించడమే ఎక్కువ! అదేదో ఛానెల్ ఉందని అదే బలుపుగా భావించి ముఖ్యమంత్రినే ఎదిరిస్తే ఇంకేం పనులు అవుతాయి? రాజకీయ రంగంలో ఎదగడానికి అనేక మార్గాలు ఉంటాయి. బ్లాక్ మెయిల్ బెదిరింపులు ఇక్కడ చెల్లవు. తాటాకు చప్పుళ్లకు జాతీయ పార్టీలు కనీసం ఉలిక్కి పడవు. ఓటు వేసిన ప్రజలను కాదని, గెలుపు తమ ప్రతిభ అనుకుని విర్రవీగిన ఎందరో ఇలా వచ్చి అలా మాయమయ్యారు. ఎంతమందిని చూడలేదు? రాజగోపాల్ రెడ్డి అయినా అంతే! ప్రేంసాగర్ రావు అయినా అంతే! వ్యక్తి వ్యవస్థగా మారడం రాజకీయ పార్టీల్లో కుదరదు. మహా మహా నేతలు వేల కోట్లు ఉండి కూడా ఏదొక రాజ్యసభ తో సరిపెట్టుకుని తమ పనులు చక్కబెట్టుకుంటూ ఉంటారు. మళ్ళీ రాజీనామా చేస్తా.. అని భయపెడితే పార్టీ పట్టించుకోదు. జనం కూడా పట్టించుకోరు. ఇది కాంగ్రెస్ పార్టీ.. ఉడుత ఊపులు ఇక్కడ చెల్లవు!!
– డా. మహ్మద్ రఫీ