కమ్యూనిస్టు పార్టీలపై తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కామ్రేడ్స్ శక్తి, యుక్తులపై ఆయన నిర్వచించారు. కమ్యూనిస్టులు ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేసే కార్యక్రమాలను తమ ప్రభుత్వం ఏరకంగానూ నిలువరించడం లేదని, వెసులుబాటు కల్పిస్తోందన్నారు. కమ్యూనిస్టు సోదరులను తాను ఉప్పుతో పోలుస్తానని చెప్పారు. ఏ వంటను ఎన్ని మసాలాలతో వండినా, అందులో ఉప్పు వేయకుంటే రుచి ఉండదన్నారు. కమ్యూనిస్టులు చెప్పే మాటలపై ప్రజలకు ఒక నమ్మకం ఉంటుందన్నారు. కమ్యూనిస్టులు అధికారంలోకి తీసుకురావడానికి పనికొస్తారో, పనికిరారో తాను విశ్లేషించలేనుగాని, ఉన్నోన్ని దించడానికి మాత్రం నూటికి నూరుశాతం పనికొస్తారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో శుక్రవారం జరిగిన సీపీఎం పత్రిక ‘నవ తెలంగాణ’ పదేళ్ల వార్షికోత్సవ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు.


