కమ్యూనిస్టులపై బీజేపీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు చేసిన వ్యాఖ్యలపై సీపీఎం ఖమ్మం జిల్లా కమిటీ స్పందించింది. ఈమేరకు సీపీఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర్ రావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఖమ్మం బీజేపీ అడ్డాగా మారుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పగటి కలలు కంటున్నారని నున్నా నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం ఖమ్మం పర్యటనకు వచ్చిన రామచందర్రావు మాట్లాడుతూ, కేరళ, బెంగాల్ తరహాలో ఖమ్మంలో కూడా కమ్యూనిస్టులు బీజేపీలో చేరాలని ఇచ్చిన పిలుపు నున్నా నాగేశ్వర్ రావు తీవ్రంగా స్పందించారు.
కేరళ, బెంగాల్ తదితర రాష్ట్రాల్లో బీజేపీ ఉన్మాద, విధ్వంసకర రాజకీయాలను, కుట్రలు, కుయుక్తులను అర్థం చేసుకున్న చాలా మంది బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బయటికి వచ్చి కమ్యూనిస్టు ఉద్యమంలో చేరిన విషయాలను తెలుసుకోవాలని నున్నా నాగేశ్వర్ రావు రామచందర్ రావును ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. మారణ హోమాలు, మత కలహాలు సృష్టించే కుటిల యత్నాలను ఎండగడుతూ, ఆధారాలతో సహా వారు పుస్తకాలు ప్రచురించిన విషయాలను బీజేపీ నాయకులు తెలుసుకోవాలన్నారు.
ఖమ్మంలో గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీ ఇతర పార్టీల నాయకులకు డబ్బులు, పదవులు ఆశలు చూపి బలపడాలని చేసిన ప్రయత్నాలను కమ్యూనిస్టు చైతన్యం కలిగిన ఖమ్మం జిల్లా ప్రజలు తిప్పి కొట్టిన విషయం గుర్తు చేసుకోవాలన్నారు. అనేక సంవత్సరాలుగా బీజేపీ మత ఘర్షణలు సృష్టించే ప్రయత్నం చేసినా ఇక్కడ పారడం లేదని, ఇక ముందు ఆ కుట్రలు ఇక్కడ సాగనీయబోమన్నారు. బీజేపీ తన సిద్ధాంతాలను గాలికి వదిలేసి, అవినీతి పరులను అక్కును చేర్చుకుంటోందని, అధికారం కోసం ఎంతటి నీచస్థాయికైనా దిగజారుతుందని నున్నా నాగేశ్వర్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
