హైదరాబాద్-విజయవాడ హైవేలో ‘ఈగల్’ (Team (Elite Action Group for Drug Law Enforcement) వేటలో రూ. 5.00 కోట్ల విలువైన 935.6 కిలోల గంజాయి పట్టుబడింది. అత్యంత పకడ్బందీగా, సాంకేతికత ఆధారంగా ఖమ్మం, రాచకొండ నార్కోటిక్ పోలీస్ స్టేషన్లకు చెందిన ఈగల్ టీం ఈ భారీ గంజాయి నిల్వలను పట్టుకోవడం విశేషం. తద్వారా ఒడిషా, మహారాష్ట్రల మధ్య నడుస్తున్న వ్యవస్థీకృత గంజాయి స్మగ్లింగ్ సిండికేట్ ను ఛేదించినట్లు ఈగల్ అధికారులు వెల్లడించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెడితే..

టయోటా ఇన్నోవా వాహనం ఎస్కార్టుగా టాటా ఐషర్ వెహికల్ లో భారీ మొత్తంలో గంజాయి రవాణా అవుతున్నట్లు ఈగల్ విభాగానికి సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన ఈగల్ అధికారులు విజయవాడ-హైదరాబాద్ హైవేపై నిఘా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2-4 గంటల మధ్య నేషనల్ హైవే లోని బాటసింగారం పండ్ల మార్కట్ జంక్షన్ ద్వారా గంజాయి రవాణా కాన్వాయ్ వెడుతున్నట్లు గుర్తించారు. ఖమ్మం, రాచకొండ నార్కోటిక్ పోలీస్ స్టేషన్లకు చెందిన టీంలు, నిఘా విభాగాలు, సాంకేతిక సిబ్బందితో బాటసింగారం వద్ద అప్పటికే మోహరించారు. సరిగ్గా మధ్యాహ్నం 3.05 గటలకు గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను అడ్డగించారు.

ఆ తర్వాత వాహనాలను తనిఖీ చేయగా, టాటా ఐషర్ వాహనంలో ఖాళీ ప్లాస్టిక్ పండ్ల ట్రే కింద దాచిన 35 HDPE సంచులను కనుగొన్నారు. ఈ సంచుల్లో 455 గంజాయి ప్యాకెట్లు బ్రౌన్ టేపులతో సీల్ చేశారు. పట్టుకున్న గంజాయి మొత్తం 935.611 కిలోలుగా గుర్తించారు. ఈ ఘటనలో నిందితులుగా గుర్తించిన పవార్ కుమార్ బాదు, సమాధాన్ కాంతిలాల్ భీసే, వినాయక్ బాబా సాహెబ్ పవార్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు. గంజాయి రవాణాకు ఉపయోగించిన టాటా ఐషర్, ఎస్కార్టుగా వాడిన టయోటా ఇన్నోవా వాహనాలతోపాటు ఆరు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ‘ఈగల్’ అధికారులు వివరించారు.
