Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

నిమిష ప్రియ ఉరిశిక్ష: నిజంగానే కేఏ పాల్ వాయిదా వేయించారా?

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేేఏ పాల్ ఒక వీడియో విడుదల చేశారు. యెమెన్ దేశాధినేతలతో కలసి మాట్లాడినట్లు, ప్రార్ధన చేసినట్లు ఆ వీడియో ఉంది. నిజానికి నిమిష ప్రియ మరణ శిక్ష వాయిదా వెనుక ఆయన చెబుతున్నట్లు ఆయన హస్తం ఉందా? అని విచారిస్తే పూర్తిగా అబద్ధమని తేలింది. ఫ్యాక్ట్ చెక్ లోనూ అది వాస్తవం కాదని తేలింది. యెమెన్ లో కొందరు మిత్రులను అడిగితే, వారు కూడా అవునా? అని ఆశ్చర్యపోయారు మన మాదిరిగానే..

నిమిష కేరళకు చెందిన నర్సు. భర్తతో కలసి యెమెన్ లో వుంటూ క్లినిక్ ప్రారంభించింది. యెమెన్ దేశానికి చెందిన తలాల్ మెహది కూడా తన క్లినిక్ లో భాగస్వామి. 2017లో మత్తు ఇంజక్షన్ ఇచ్చి మెహదిని చంపేసింది నిమిష ప్రియ. దోషిగా నిర్ధారించబడిన తర్వాత 2020లో మరణశిక్ష విధించారు.

జులై 16, 2025న అంటే ఇవాళ ఆమెను ఉరి తీయాల్సి ఉంది. భారత దౌత్యవేత్తలు ఆమె క్షమాబిక్ష కోసం ఆ దేశంతో చర్చలు జరిపి వాయిదా వేయించగలిగారు. యెమెన్ దేశపు షరియా చట్టం ప్రకారం చర్చలు కొనసాగించారు. నిమిష కుటుంబ సభ్యులు మెహది కుటుంబానికి 10 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. వారు ఈ ఆఫర్ ను ఇంకా అంగీకరించలేదు కానీ, మొత్తానికి భారత దౌత్యవేత్తలు చర్చల ద్వారా మరణ శిక్షను వాయిదా వేయించగలిగారు.

ఉరిశిక్ష వాయిదా పడగానే కేఏ పాల్ వీడియో విడుదల చేశారు. తన వల్లే వాయిదా జరిగిందని చెప్పుకున్నారు. కానీ, కాస్త లోతుగా పరిశోధన చేస్తే ఉరిశిక్ష వాయిదాతో పాల్ కు సంబంధం లేదని తేలింది. మత పెద్దలు అబూబకర్, హబీబ్ ఉమర్ బిన్ హఫీజ్ పాత్ర ఉన్నట్లు తెలిసింది. కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ విజ్ఞప్తి మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. ఫలితంగా ఉరి శిక్ష వాయిదా పడింది. GROK ఫ్యాక్ట్ చెక్ ప్రకారం చూసుకున్నా దౌత్యవేత్తల చర్చల ఫలితమే అని తేలింది. నిమిష తల్లి ప్రేమ కుమారి ప్రారంభించిన “సేవ్ నిమిష ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్” పాత్ర కూడా అధికంగా ఉన్నట్లు తెలిసింది.

నిమిష 2018 నుంచి యెమెన్ సెంట్రల్ జైలులో ఉన్నారు. ఆమె వయసు 36 సంవత్సరాలు. కుటుంబ ఆర్ధిక ఇబ్బందులు తొలగించుకోవాలని 2008లో యెమెన్ కు వలస వెళ్ళింది. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా చేరింది. థామస్ అనే వ్యక్తిని 2011లో వివాహం చేసుకుంది. నిమిషకు 2012లో కుమార్తె జన్మించింది. 2014లో అక్కడి యుద్ధ వాతావరణానికి భయపడి భర్త థామస్ కుమార్తె ఇండియా వచ్చేశారు. నిమిష అక్కడే ఉండాలనుకుంది. క్లినిక్ ప్రారంభించడానికి అక్కడ నిబంధనల ప్రకారం స్థానికులు భాగస్వామ్యం ఉండాలి. అక్కడ టెక్స్ టైల్స్ షోరూం నిర్వహిస్తున్న తలాల్ మెహదితో కలసి క్లినిక్ ప్రారంభించింది.

క్లినిక్ ప్రారంభించాక మెహది తన పాస్ పోర్ట్ తీసుకోవడం, ఆదాయాన్ని తన వైపు తిప్పుకోవడం నిమిషకు నచ్చలేదు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా ఆమెకు న్యాయం జరగలేదు. పైగా తనను పెళ్ళి చేసుకుని వేధిస్తున్నదని, దొంగతనం చేసిందంటూ మెహది ఆమెఫై ఎదురు కేసులు పెట్టడంతో నిమిషను అరెస్ట్ చేసి 16 రోజులు రిమాండ్ లో ఉంచారు.

జైలు నుంచి విడుదలయ్యాక తన పాస్ పోర్ట్ తీసుకుని ఇండియా వచ్చేయాలనుకుంది. దాంతో మెహది నిద్రపోతున్న సమయంలో మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది. ఓవర్ డోస్ కారణంగా అతను చనిపోయాడు. నిమిష తన స్నేహితురాలు హనాన్ సహకారంతో మెహది భౌతిక కాయాన్ని ముక్కలుగా కట్ చేసి వాటర్ ట్యాంక్ లో పడేసింది. పాస్ పోర్ట్ తీసుకుని సౌదీలో తల దాచుకుంది.

సౌదీలో ఉన్న నిమిషను 2017లో యెమెన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో ఆమెను దోషిగా నిర్ధారించారు. అరబిక్ భాష తెలియక తనకు అన్యాయం జరిగిందనేది నిమిష వాదన. ఈ నేపథ్యంలోనే 2020లో మళ్ళీ విచారణ చేసినా న్యాయం జరగలేదు. కుటుంబానికి ఆర్ధిక ఆసరా ఇస్తే క్షమాబిక్ష పెట్టే అవకాశాన్ని కోర్టు కల్పించింది.

నిమిష మరణ శిక్షను 2024లో యెమెన్ అధ్యక్షుడు రషద్ అల్ ఎలిమి ఆమోదించారు. ఈనెల 16న ఉరి తీయాల్సి ఉంది. కానీ భారత ప్రభుత్వం విదేశీ మంత్రిత్వ శాఖ, దౌత్య వేత్తలు, అక్కడి స్థానిక మతాధికారులు మానవతా దృక్పథంతో జోక్యం చేసుకున్నారు. ఉరిశిక్ష రద్దు కాలేదు కానీ, ప్రస్తుతానికి వాయిదా పడింది. ప్రస్తుతం నిమిష అక్కడి సెంట్రల్ జైలులో ఉంది. మెహది కుటుంబం క్షమాభిక్ష ప్రసాదిస్తే ఉరి శిక్ష రద్దవుతుంది. తల్లి ప్రేమకుమారి అక్కడే ఉండి మెహది కుటుంబ సభ్యులతో చర్చలు జరుపుతున్నారు.

నిజానికి మెహది తనపై శారీరక వేధింపులుకు పాల్పడ్డాడనే విషయాన్ని నిమిష కోర్టులో ఒప్పుకోలేదు. కేవలం పాస్ పోర్ట్ కోసమే హత్య చేసినట్లు చెప్పింది. పొరపాటున ఓవర్ డోస్ ఇచ్చినట్లు పేర్కొంది. మెహది నిమిష స్నేహం నచ్చకనే భర్త థామస్ కుమార్తెను తీసుకుని ఇండియాకు వచ్చేశారనే వార్త అక్కడ వినిపిస్తోంది. మెహది కుటుంబ సభ్యులు ప్రస్తుతానికి క్షమాబిక్షకు అంగీకరించడం లేదు. రూ. 25 కోట్లకు అంగీకరించే అవకాశం కనిపిస్తోంది. నిమిష తల్లి ప్రేమ కుమారి డోనార్స్ రూపంలో వసూలు చేసి 10 కోట్ల రూపాయల వరకు ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. చూడాలి, భవిష్యత్ లో ఏం జరగబోతున్నదో!

– డా. మహ్మద్ రఫీ

Popular Articles