జనగామ జిల్లాలో ఓ భర్తను కొట్టి చంపారు అతని ఇద్దరు భార్యలు. లింగాల ఘనపురం మండలం పిట్టలోనిగూడెంలో గత రాత్రి జరిగిన ఈ ఘటనలో హతుడు అత్తను హత్య చేసిన ఉదంతంలో నిందితుడు కావడం గమనార్హం. స్థానికుల కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలకు చెందిన కాలియా కనకయ్య (30) కు సొంత అక్కాచెళ్లెల్లు శిరీష, గౌరమ్మ అనే భార్యలు ఉన్నారు. ఏడాది క్రితం కనకయ్య తన అత్తను హత్య చేసి జైలుకు వెళ్లి వచ్చాడు. అప్పటి నుంచి భార్యలు కనకయ్య వద్దకు కాపురానికి వెళ్లకుండా తల్లిగారింట్లోనే ఉంటున్నారు.
అయితే సోమవారం రాత్రి మద్యం సేవించిన కనకయ్య అదే మత్తులో భార్యలతో గొడవకు దిగాడు. ఈ సందర్భంగా ఇద్దరు భార్యలను హతమార్చేందుకు ప్రయత్నించాడు. ఈ గొడవలో భార్యలిద్దరై కనకయ్యను అతను తెచ్చిన గొడ్డలితోనే హతమార్చారు. ఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


