మల్టీ జోన్-1 పరిధిలో పనిచేస్తున్న ముగ్గురు సీఐలకు ఐజీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని పోలీస్ శాఖ ఉత్తర్వు జారీ చేసింది. ఈ జోన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఎనిమిది మంది సీఐలకు స్థాన చలన కలిగిస్తూ మల్టీ జూన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వు జారీ చేశారు. ఇందులో ముగ్గురు సీఐలకు ఎటువంటి పోస్టింగ్ ఇవ్వకుండా ఐజీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.
స్థానచలనానికి గురైన సీఐలలో వెయిటింగ్ లో గల నల్లమోతు చిట్టిబాబును ఖమ్మం మహిళా పోలీస్ స్టేషన్ కు, ఇక్కడ పనిచేస్తున్న తుమ్మలపల్లి శ్రీహరిని సత్తుపల్లికి, కామారెడ్డి సీఎస్ బీలో పనిచేస్తున్న అన్నదేవర తిరుపయ్యను కామారెడ్డి జిల్లా బాన్సువాడ రూరల్ కు, రామగుండం కమిషనరేట్ పరిధిలోని తాండూర్ లో పనిచేస్తున్న కన్నం కుమారస్వామిని మధిరకు, వెయిటింగ్ లో గల ఆర్, బన్సీలాల్ ను రామగుండం కమిషనరేట్ పరిధిలోని చెన్నూర్ సర్కిల్ కు పోస్టింగ్ ఇస్తూ బదిలీ చేశారు.
అదేవిధంగా సత్తుపల్లి సీఐగా పనిచేస్తున్న తెల్లబోయిన కిరణ్ ను, బాన్సువాడ సీఐ తోకల రాజేష్ ను, మధిరలో పనిచేస్తున్న దొంగరి మధును హైదరాబాద్ లోని మల్టీజోన్-1 ఐజీ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులో ఆదేశించారు. ఈ ముగ్గురికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.


