యాధృచ్చికమో, పూర్వ జన్మలంటూ ఉంటే వాటి పర్యవసానామో తెలియదు! ఇద్దరు అందగత్తెల జీవితాలు అటు ఇటుగా అర్ధాంతరంగా ముగిసిపోయాయి! ఒకేరోజు ఒకే సమయంలో ఇద్దరి జీవితాలను ముగించుకున్నారు! ఒకరు మోడల్, వీడియో జాకీ, బాలీవుడ్ నటి షెఫాలి జరీవాలా, మరొకరు కవయిత్రి, యాంకర్, జర్నలిస్ట్ స్వేచ్ఛ వొటార్కర్!
శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో ముంబయిలోని తన ఫ్లాట్ లో షెఫాలి గుండెపోటుకు గురైంది. రెండవ భర్త పరాగ్ త్యాగీ వెంటనే హుటాహుటిన కూపర్ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది! సరిగ్గా అదే సమయంలో హైదరాబాద్ జవహర్ నగర్ లో తాను ఉంటున్న ఫ్లాట్ లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది స్వేచ్ఛ! పోలీసులకు సమాచారం ఇచ్చి వచ్చేసరికి ఆమె చనిపోయి వుంది! ఇద్దరి భౌతిక కాయాలు పోస్టు మార్టంకు నోచుకున్నాయి. నిన్న విషాద ఛాయల మధ్య ఇరువురి అంత్యక్రియలు ముగిశాయి.

షెఫాలి వయసు 42 ఏళ్లు. అహ్మదాబాద్ కు చెందిన అందాల సుందరి. పదవ తరగతిలోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. సినిమా అవకాశాల కోసం ముంబయిలో ఇంజనీరింగ్ సీటు సంపాదించుకుంది. 2002లో కాంటా లగా రేమిక్స్ వీడియో ఆల్బమ్ లో నటించి వైరల్ అయి దుమ్ము రేపింది. ఆ తరువాత సల్మాన్ ఖాన్ సినిమా ముజ్ సే షాదీ కరోగి లో మెరిసింది. ఆమె బ్యూటిఫుల్ పర్సనాలిటీ, ముఖ్యంగా కళ్ళు చూసి మరో మందాకిని వచ్చేసింది అన్నారు. బాలీవుడ్ ను ఏలుతుందనుకున్నారు. మీట్ బ్రదర్స్ గా పేరొందిన సంగీత కళాకారుల్లో ఒకరైన హర్మిత్ సింగ్ ప్రేమలో పడి పెళ్ళి చేసేసుకుంది. అవకాశాలు తగ్గిపోయాయి. తెలుగులో ఐతే ఏంటి సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. కన్నడలోనూ నటించింది. నచ్ బలియే రియాలితే షో ద్వారా పరాగ్ త్యాగీ జోడీ కుదిరింది. రెండు సీజన్ లలో ఇద్దరూ కలిసి చేశారు. సూపర్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. హర్మిత్ తో పెళ్ళి విడాకులకు దారి తీసింది. ఆ గ్యాప్ లో టీవీ స్టార్ సిద్ధార్డ్ శుక్లాతో కొన్నాళ్ళు డేటింగ్ చేశాక పరాగ్ త్యాగిని పెళ్ళి చేసుకుంది. పిల్లలు లేరు, వద్దనుకుంది. పిల్లలు పుడితే అందం చెదరి పోతుందేమో అని భయం. వయసు కనిపించకుండా ఉండేందుకు అనేక రకాల మెడిసిన్స్ వాడింది. చివరకు యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్స్ తీసుకునే స్థాయికి చేరింది. శుక్రవారం మహాలక్ష్మి పూజ ఉపవాసం ఉండి ఏం తినకుండానే ఇంజెక్షన్ వేసుకుంది. అది వికటించి గుండెపోటు కు దారి తీసింది. ఇంట్లోనే వున్న పరాగ్ ఆసుపత్రికి తరలిస్తే అప్పటికే కనుమూసింది. పోలీసులు ఇంట్లో ఇంజెక్షన్స్ గుర్తించారు. వాటి వల్లే ఆమె మృతి చెందినట్లు పోస్ట్ మార్టం రిపోర్ట్!

స్వేచ్ఛ వయసు 40 ఏళ్లు. డిగ్రీ చదువుతూనే ఒక స్టూడియోలో పనిచేసే అతనితో ప్రేమలో పడి పెళ్ళి చేసేసుకుంది. మంచి న్యూస్ యాంకర్ కావాలనే లక్ష్యంతో వనిత టీవీలో చేరింది. అక్కడి నుంచి మహా న్యూస్. అప్పటికే మొదటి భర్తతో విడాకులు తీసుకున్న స్వేచ్ఛ అక్కడ ప్రొడక్షన్ లో పనిచేసే క్రాంతిని పెళ్ళి చేసుకుంది. పాప పుట్టాక భర్తతో మనస్పర్థలు. T న్యూస్ లో పని చేస్తున్నప్పుడు అక్కడ కల్చరల్ ఇంచార్జిగా పని చేస్తున్న పూర్ణ చందర్ తో పరిచయం. భర్త క్రాంతికి విడాకులు. అప్పటికే పెళ్ళి అయి పిల్లలు వున్న పూర్ణ చందర్ ఆ విషయం దాచి దగ్గరవడం, సహజీవనం మొదలుపెట్టారు. భార్యకు విడాకులు ఇచ్చి స్వేచ్ఛను పెళ్ళి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. మాట దాటవేస్తూ వచ్చాడు. మూడు రోజుల ముందే ఇద్దరూ అరుణాచలం వెళ్లి వచ్చారు. ఏం జరిగిందో తెలియదు. శుక్రవారం స్వేచ్ఛ బలవన్మరణానికి పాల్పడింది. స్వేచ్ఛ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంది. Tv9 న్యూస్ ప్రెజెంటర్ గా చేస్తూ అందరికి సుపరిచితురాలైంది. 10tv, hmtv, V6లలో పని చేసి చివరకు T న్యూస్ లో చేస్తూ వెళ్ళిపోయింది స్వేచ్ఛ. మట్టిపూల గాలి కవితా సంపుటి విడుదల చేసింది.
ఈ ఇద్దరి జీవితాలను చూస్తే ఏమనిపిస్తోంది! దాదాపు అటు ఇటుగా ఒకేలా ఉన్నాయి! ఇద్దరూ అందగత్తెలే! చాలా మంది మనసు పడే అందం! ఎన్నో అవకాశాలు వచ్చినా సరిగ్గా సెలెక్ట్ చేసుకోలేని ఓటమి! తలిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛలో సరైన నిర్ణయాలు తీసుకోలేని అసమర్ధత! తలిదండ్రుల పని ఒత్తిళ్లలో ఒంటరితనం, సహకారం లేకపోవడం! మరోవైపు పాడు లోకంలో ఎన్నో దారులు ఎన్నో అవకాశాలు! సరైన గైడెన్స్ లేక తప్పటడుగులు! పైగా ఇద్దరూ సెలబ్రిటీలు! మొఖాన నవ్వులు చెదరితే సమాజం హర్షించదు! ఎన్ని బాధలు వున్నా నవ్వుతూ తుళ్లుతూ కనిపించాలి! ఏమాత్రం తేడా కనిపిస్తే సమాజం ఊరుకోదు! తమ బాధను ఎవ్వరికీ చెప్పుకోలేరు! స్నేహితులను నమ్మలేరు! లోలోన కుమిలిపోతూ మానసిక ఒత్తిళ్లకు గురవుతూ అనారోగ్యాల పాలవుతూ ఆసుపత్రులకు తిరుగుతూ మందులు వాడుతూ వారు చేసే అవధానం అంతా ఇంతా కాదు! అందమైన లోకంలో అలా మెరుస్తూ ఉండాలంటే ఎంతో కష్టం! అభిమానులు మరో వైపు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటారు! ఈ ఒత్తిళ్లను తట్టుకున్న వాళ్ళు ముందుకు వెళుతుంటారు! తట్టుకోలేని వారు, మరింత సున్నిత హృదయలు ఇలా మధ్యలో ఏదొక రూపంలో జీవితాలను ముగించుకుంటూ ఉంటారు! వీరిద్దరి జీవితాలు యువతకు గుణ పాఠాలు కావాలని కోరుకుంటూ ఇద్దరికి నివాళులు అర్పిస్తున్నాను.
-డా. మహ్మద్ రఫీ