మీరెప్పుడైనా ‘మహాన్యూస్’ అనే ఓ శాటిలైట్ ఛానల్ లైవ్ డిబేట్ల తాలూకుగాని, వార్తాకథనాలకు సంబంధించిగాని యూ ట్యూబ్ థంబ్ నెయిల్స్ చూశారా? ఇదెక్కిడి ఛానల్ అనుకుంటున్నారా? తెలుగు మీడియాలో అదీ ఓ న్యూస్ ఛానలే. ప్రముఖ పత్రికకు చాలాకాలంపాటు ప్రసిద్ధ ఎడిటర్ గా పనిచేసిన ఐ. వెంకట్రావు స్థాపించిన న్యూస్ ఛానల్ ఇది. ఐవీఆర్ గా పిలువపడే ఐ. వెంకట్రావు చేతుల్లో ఉన్నపుడు ఈ ఛానల్ కు ప్రేక్షకుల్లో గల అభిప్రాయం వేరు. ఆయన ఛానల్ ను నడిపించిన ఔన్నత్యం తీరు వేరు. ఇప్పుడీ ఛానల్ గురించి చర్చ ఎందుకూ..? అంటే నిన్న హైదరాబాద్ లోని మహాన్యూస్ ఛానల్ స్టూడియోపై బీఆర్ఎస్ కార్యకర్తలు సాగించిన విధ్వంసకాండ ఇప్పుడు మీడియా సర్కిళ్లలో భిన్న చర్చకు తావు కల్పించడమే.
ఐ. వెంకట్రావు వంటి ఒక గొప్ప ఎడిటర్ స్థాపించిన ఓ న్యూస్ ఛానల్ ఆ తర్వాత చేతులు మారి మారెళ్ల వంశీ అనే జర్నలిస్టు చేతుల్లోపడి ప్రస్తుతం నడుస్తోంది. ఓ సాధారణ జర్నలిస్టు నుంచి న్యూస్ ఛానల్ ఛైర్మెన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి వంశీ ఎదగడం విశేషమే. ఇంతటి స్థాయికి ఎదిగిన వంశీ అనే వ్యక్తి ఆధ్వర్యంలో నడుస్తున్న ఛానల్ జర్నలిజపు ప్రమాణాలు ఎలా ఉండాలి? జర్నలిజం.. దాని ప్రమాణాలు, విలువలు, విశ్వసనీయత వంటి లోతుల్లోకి వెడితే కంటెంట్ చేంతాడంత అవుతుంది. అందుకే మహాన్యూస్ వంశీ అనబడే ఛానల్ ఓనర్ నిర్వహించిన డిబేట్లు, వార్తాకథనాలకు సంబంధించిన యూ ట్యూబ్ థంబ్ నెయిల్లను ఓసారి పరిశీలిద్దాం.
‘YES KTR కోసం ఆ హీరోయిన్ వచ్చింది.., కాపురాలు కూల్చేశారు!, ఫోన్ ట్యాప్ చేసి హీరోయిన్లను అక్కడికి రమ్మన్నారు, ఆ యాంకర్లకు రాత్రి కాల్ చేసి రాకపోతే రికార్డింగ్స్ బాగోతాన్ని బయటపెట్టి..!, జడ్జి దంపతులను రమ్మని.. ఫోన్ ట్యాపింగ్ కేసులో భయంకర నిజాలు, రాత్రిళ్లు, రాసలీలు మధ్యలో ఫోన్ ట్యాపిగులు, రాత్రికి రాకపోతే..హీరోయిన్స్, మోడల్స్ కాల్ రికార్డింగ్ భయపెట్టి, కేసీఆర్ కొంపలో ట్యాపింగ్ కుంపటి .., ’’
ఇవీ ‘మహాన్యూస్’ అనే శాటిలైట్ న్యూస్ ఛానల్ యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన డిబేట్ల, వార్తా కథనాల తాలూకు థంబ్ నెయిల్స్. ఈ థంబ్ నెయిల్లలో కేటీఆర్, కేసీఆర్ ఫొటోలను విరివిగా వాడడం గమనార్హం. అంతేకాదు అవే థంబ్ నెయిళ్లలో కొందరు హీరోయిన్ల, ఓ ప్రభుత్వ మహిళా ఉన్నతాధికారి ఫొటోల ముఖాలకు బ్లాక్ కలర్ పూసి వాడారు. కానీ సరిగ్గా గమనిస్తే వాళ్లెవరో మారెళ్ల వంశీ వంటి జర్నలిస్టులు పసిగట్టే అవకాశం లేకపోలేదు. ఈ థంబ్ నెయిల్ చూసిన యూ ట్యూబ్ ప్రేక్షకులు ఇందులో ఏదో ఉందంటూ ఆసక్తిగా లింక్ ఓపెన్ చేసి చూడడం సహజం. ఈ బాపతు థంబ్ నెయిల్ల వీడియోలకు లక్షల్లో వ్యూస్ ఉన్నాయనేది వేరే విషయం. దానివల్ల మహాన్యూస్ ఛానల్ వంశీకి యూ ట్యూబ్ నుంచి డబ్బు కూడా భారీగానే రావచ్చు.

నిన్న మహాన్యూస్ ఛానల్ పై దాడి ఘటన తర్వాత అసలు వీళ్లు అంత గొప్పగా చూపిన వార్తలేమిటి? ప్రసారం చేసిన కథనాలేమిందోనని పరిశీలించేందుకు నేనూ కాసేపు ఒకటి, రెండు వీడియోలను చూశాను. థంబ్ నెయిల్ హెడ్డింగ్ బాపతు విషయమేదీ ఈ వీడియోల్ో లేకపోవడం గమనార్హం. ఛానల్ ఓనర్ వంశీ వాళ్ల క్రైం రిపోర్టర్ (పేరు మధు అనుకుంటా)ను ఉటంకిస్తూ.. అక్కడేం జరుగుతోంది మధూ? అని ప్రశ్నిస్తాడు. ‘సర్ అసలేం జరుగుతోందంటే.. ‘ఇక్కడంతా ‘ఇలఖత మఫిలియా’ టైపులో నడుస్తోంది అంటాడు ఓ వీడియోలో. ప్రతి గోడపై ట్యాపింగ్ మిషన్లు పెట్టారు.. ‘గోదారి గట్టుమీద రామచిలకావే.. అనే వెంకటేష్ సినిమాలోని పాట టైపులో ప్రతి గోడమీదా ట్యాపింగ్’, హీరోయిన్లను బెదిరించి అక్కడికి తీసుకువెళ్లారు.. అక్కడికి ఎందుకు తీసుకువెళ్లారో మాత్రం తెలియదు’ అంటూ.. రిప్లయి ఇస్తాడు సదరు క్రైం రిపోర్టర్ మరో వీడియోలో. కానీ థంబ్ నెయిల్ కంటెంట్ మాత్రం ఎక్కడా కనిపించదు, కనీసం వినిపించదు.
ఇదీ వంశీ మార్క్ జర్నలిజానికి థంబ్ నెయిల్ల ఆనవాళ్లు. నిజానికిది మెయిన్ స్ట్రీమ్ టైపు జర్నలిజం కానేకాదు. ఎవడో యూ ట్యూబర్ వ్యూస్ పెంచుకుని డబ్బు సంపాదించేందుకు చేసే అత్యంత జుగుప్సాకర బూతు బాపతు వ్యవహారం. ప్రముఖ శాటిలైట్ న్యూస్ ఛానల్ లో గతంలో ఫీల్డ్ రిపోర్టర్ గా పనిచేసిన వంశీ అనేబడే ప్రస్తుత మహాన్యూస్ ఛానల్ యజమాని నిర్వహిస్తున్న జర్నలిజం ఈ తరహా థంబ్ నెయిల్ల స్థాయికి దిగజారడమే అసలు విషాదం. అంత మాత్రాన స్టూడియోపై రాళ్లు వేసి, కార్ల అద్దాలు పగులగొట్టి, కెమెరాలను ధ్వంసం చేస్తారా? అని ప్రశ్నిస్తే మాత్రం ఈ అంశంలో కొందరు బీఆర్ఎస్ కార్యకర్తల చేష్టలు అత్యంత హేయమైనవి. అవాంఛనీయమైనవి కూడా. తమ ఫొటోలు వేసి ప్రసారం చేసి,అనైతిక థంబ్ నెయిల్లతో యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన వార్తా కథనాలను నిరూపించాలని కేటీఆర్ చట్టపరంగా పోరాడితే వంశీ ఎలా నిరూపిస్తాడనేది పెద్ద ప్రశ్నార్థకమే. కానీ ఇదే సమయంలో పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, మీడియా ముసుగులో విషం.. అంటూ బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తుతం చేస్తున్న వాదనలోని వాస్తవాన్ని గ్రహించడానికి గత ఉదంతాలను కూడా కొన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.

మాకు వ్యతిరేక వార్తలను రాస్తే పాతేస్తాం, నీది ఏ పేపర్? ఏ ఛానల్? నీ పేరేమిటి? అంటూ తమ పాలన హయాంలో మీడియా ప్రతినిధులపై బెదిరింపులకు దిగిన గులాబీ పార్టీ నేతల తీరును జర్నలిస్టు వర్గాలేమీ ఇంకా మర్చిపోలేదు. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మహిళా యూట్యూబర్లు చేసిన జుగుప్సాకర ‘జర్నలిజం’ను బీఆర్ఎస్ నేతలు సమర్ధించినపుడు సైతం పత్రికా స్వేచ్ఛ గురించి, ప్రజాస్వామ్యం గురించి కూడా అప్పట్లో గులాబీ పార్టీ నేతలు చేసిన వాదనను మీడియా వర్గాలు నేటికీ మర్చిపోలేదు.
అందువల్ల చెప్పొచ్చేదేమిటంటే.. వంశీ ‘మార్క్’ థంబ్ నెయిల్ల బాపతు కంటెంట్ జర్నలిజమే కాదు, ఎప్పటికీ కాదు కూడా. ఈ నేపథ్యంలోనే వంశీ మార్క్ జర్నలిజంపై చట్టపరంగా చర్య తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ స్టూడియోపై రాళ్లేసి విధ్వంసం సృష్టించడం, మీడియాను భీతావహానికి గురిచేయడం కూడా ప్రజాస్వామ్యం కాదు. గతంలో రేవతి బాపతు జర్నలిజాన్ని పూర్తిస్థాయిలో సమర్థించిన బీఆర్ఎస్ నాయకుల నోటి నుంచి నినదించిన పత్రికా స్వేచ్ఛపైనా ప్రస్తుత సందర్భంలో భిన్న చర్చ జరుగుతోంది.
-ఎడమ సమ్మిరెడ్డి