న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్ (40) గత రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం ఆమె ఓ తెలుగు న్యూస్ ఛానల్ లో యాంకర్ గా పనిచేస్తున్నారు. హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జవహర్ నగర్ లోగల తన నివాసంలో గత రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. లుంగీతో ఫ్యాన్ కు ఉరేసుకుని స్వేచ్ఛ ఈ ఘటనకు పాల్పడినట్లు చెప్పారు. దాదాపు ఐదేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న స్వేచ్ఛ తన కూతురు, మరో స్నేహితునితో కలిసి ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. స్నేహితునితో ఏర్పడిన మనస్పర్ధల వల్లే స్వేచ్ఛ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. స్వేచ్ఛ జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ హౌజింగ్ సొసైటీ ఎన్నికల్లో కార్యవర్గ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఘటనపై చిక్కడపల్లిపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


