బరి తెగించిన మీడియా.. బట్టలిప్పుకున్న మీడియా.. దిగంబర మీడియా.. కాస్త పరుష పదాలే అయినప్పటికీ అనివార్యమైన అభివర్ణన. తప్పనిసరి పద ప్రయోగం. ఇంకాస్త కఠినంగానే చెప్పాలంటే సిగ్గూ, ఎగ్గూ లేని మీడియా.. ఎందుకీ పరుష పదజాలం అంటే..‘భార్య భర్తల మధ్య వివాదం కేసులో భర్త తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తించి వారి హక్కులకు భంగం కలిగించినందుకుగాను ఇల్లెందు సీఐ సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వు జారీ చేశారు’ అనే వాక్యాన్ని ఓ సెక్షన్ మీడియా జీర్ణించుకోలేకపోతోంది. ఐజీని ‘కుల’ రొంపిలోకి లాగుతోంది ఆ సెక్షన్ మీడియా. ఈ అంశంలో ఐజీ చంద్రశేఖర్ రెడ్డిని వెనకేసుకొచ్చే సమీక్ష ఏమాత్రం కాదిది. చట్ట పరిధిని దాటి, కోర్టు తీర్పులను తోసిరాజని ఇష్టానుసారం వ్యవహరిస్తే బాధితులు ఫిర్యాదు చేస్తే, విచారణ అనంతరం ఉన్నతాధికారుల చర్యలు తీసుకుంటే ‘పద్ధతి’ ఎలా ఉంటుందో తెలియజేసే ప్రయత్నం మాత్రమే.
ఇక అసలు విషయంలోకి వెడితే.. ఏ ఆడకూతురికి అన్యాయం జరిగినా సహించరాదు. ఇందులో రెండో ఆలోచనకే తావు ఉండకూడదు, చట్టం, న్యాయం కూడా అదే చెబుతోంది. తనకు జరిగిన అన్యాయంపై ఆ ఆడకూతురు పోలీసులకు ఫిర్యాదు చేశారు సరే.. 498A సెక్షన్ వర్తించే విధంగానే బాధితురాలు ఫిర్యాదు ఇచ్చినట్లయితే పోలీసులు చేయాల్సిన పనేమిటి? ఒకటికి రెండుసార్లు అసలు నిందితుడైన భర్తను కదా పిలిపించి కౌన్సెలింగ్ చేయాల్సింది? భార్యా,భర్తలను కలిపేందుకు శతవిధాలుగా ప్రయత్నించాలి కదా? వినని పక్షంలో నిందితునిపై కేసు నమోదు చేయాలి. అవసరం అనుకుంటే అసలు నిందితుని బంధువులను కూడా పిలిపించి కాపురాన్ని చక్కదిద్దేందుకు మీరూ సహకరించాలని హితబోధ చేయాలి. ఇంత ప్రక్రియ నిర్వహించినా నిందితుడు వినకుంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఆ తర్వాత దర్యాప్తు చేసి చట్టపరంగా అవసరమైన చర్యలు తీసుకోవాలి.

ఎన్ఆర్ఐ నవీన్ రెడ్డి ఘటనలో అతన్ని ఇండియాకు రప్పించడం కూడా పోలీసులకు కష్టతరమేమీ కాదు. ఇటువంటి కేసుల్లో బాధితులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర పోలీసు శాఖ ప్రత్యేకంగా ఓ సెల్ ను కూడా ఏర్పాటు చేసింది. ఈ విభాగం ద్వారా పోలీసులు నిందితులకు నోటీసు పంపిస్తే సప్తసముద్రాల ఆవల ఎక్కడ దాక్కున్నా నిందితుడు పరుగెత్తుకుంటూ ఫిర్యాదు నమోదైన ఇండియాలోని పోలీస్ స్టేషన్ కు రావలసిందే. ఇటువంటి అంశాల్లో పోలీసులు పాటించాల్సిన విచారణ, కేసు, చట్టపరమైన చర్యలకు సంబంధించిన క్లుప్త సారాంశమిది.
అంతేకాదు 498A సెక్షన్ లో హైకోర్టుతోపాటు దేశ సర్వోన్నత న్యాయస్థానం సవరించిన ప్రకారం అసలు నిందితుని కుటుంబీకులపై, రక్త సంబంధీకులపై గతం మాదిరిగా పోలీసులు వ్యవహరించడానికి అవకాశమే లేదు. బాధితురాలి భర్త కుటుంబీకులను ఎవరిని అదుపులోకి తీసుకోవాలన్నా ఉన్నతాధికారుల అనుమతి తప్పనిసరి కావాలి. కానీ సస్పెన్షన్ కు గురైన ఇల్లెందు సీఐ ఇవేవీ పాటించిన దాఖలాలు లేవని తెలుస్తోంది. అందువల్లే ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్లు సమాచారం. కానీ ఓ సెక్షన్ మీడియా సీఐ సస్పెన్షన్ వేటు పడ్డాక ఐజీని టార్గెట్ చేస్తూ ‘సామాజిక’ రంగును పులుముతూ వార్తా కథనాలను వండి వారుస్తుండడమే పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఆ సెక్షన్ మీడియా ఏమంటోంది.? బాధితురాలికి ఆ పోలీస్ అధికారి న్యాయం చేయాలని తలపోశాడట! బాధితురాలికి న్యాయం చేయాల్సిన ఉన్నతాధికారులు బంధుత్వాలు, మిత్రుత్వాల పేరిట ఓ సీఐని బలి చేశారట! ‘సామాజిక’ వర్గాన్ని అడ్డుపెట్టుకుని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తేనే సీఐపై చర్యలు తీసుకుంటారా? అనే ప్రశ్నలు ఉత్నన్నమవుతున్నాయట! బాధితురాలి పక్షాన నిలబడ్డ సదరు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ను విచారణ లేకుండానే హుటాహుటిన సస్పెన్షన్ లెటర్ పంపారట! ఇలా సాగుతోంది ఐజీ చంద్రశేఖర్ రెడ్డి టార్గెట్ గా ఓ సెక్షన్ మీడియా వార్తా కథనాల ప్రచారం.
నిజానికి లోతుగా పరిశీలిస్తే నవీన్ ‘రెడ్డి’ అయినంత మాత్రాన ఐజీ చంద్రశేఖర్‘రెడ్డి’ చర్య తీసుకోవడానికి బాధితురాలేమీ ఇతర సామాజికవర్గం కూడా కాదు. ఆమె కూడా ‘రెడ్డి’ బిడ్డే. ఇక విచారణ లేకుండానే ఏ అధికారిపైన అయినా చర్య తీసుకునే అవకాశం ఉన్నతాధికారులకు ఉందా? అనే ప్రశ్న కూడా ఈ సందర్భంగా ఉత్నన్నమవుతోంది. సీఐ సత్యనారాయణపై వచ్చిన ఆరోపణలపై కేవలం భద్రాద్రి జిల్లాకు చెందిన పోలీసు ఉన్నతాధికారులే కాదు, ఖమ్మం జిల్లాకు చెందిన అదనపు ఎస్పీ ప్రసాదరావు సైతం బుధవారం విచారణ జరిపారు. స్టేషన్ లోని సీసీ ఫుటేజీలను పరిశీలించి, స్థానిక సిబ్బందిని కూడా ఆరా తీసి నివేదిక సమర్పించిన తర్వాతే సీఐపై సస్పెన్షన్ వేటు వేసినట్లు వార్తలు వచ్చాయి.

అంతేకాదు తాజా సమాచారం ప్రకారం.. నవీన్ రెడ్డి తల్లిదండ్రులను స్టేషన్ కు పిలిపించిన సందర్భంగా సీఐ సత్యనారాయణ వారితో ఉపయోగించినట్లు ఆరోపణలు వస్తున్న ‘సౌందర్యవంతమైన’ భాష గురించి ఉన్నతాధికారులకు ఆధారాలు లేకుండానే చర్య తీసుకున్నారా? ఆ వృద్ధ దంపతులను ఖైదీలను ఉంచే ప్రదేశంలో నిర్బంధించి సహజమైన పోలీస్ ‘భాష’ను సీఐ వాడినట్లు సీసీ ఫుటేజీ పరిశీలనలో ఆధారాలు లభ్యమైన తర్వాతే చర్య తీసుకున్నారా? తన తల్లిదండ్రులను స్టేషన్ తీసుకువచ్చినట్లు తెలుసుకున్న నవీన్ రెడ్డి సీఐ సత్యనారాయణతో డల్లాస్ నుంచి ఏదేని వీడియో కాల్ మాట్లాడారా? మాట్లాడితే ఈ సందర్భంగా సీఐ సత్యనారాయణ మాట్లాడిన ‘చక్కని భాష’ను వీడియో కాల్ లో నవీన్ రెడ్డి రికార్డు చేసి ఐజీకి పంపారా? ఇటువంటి అనేక ప్రశ్నలు కూడా ఈ సందర్భంగా తలెత్తుతున్నాయి.
నిజానికి సీఐని సేవ్ చేయాలని తపించే సెక్షన్ ఆఫ్ మీడియా ఈ కేసులో ఇటువంటి అనేక ప్రశ్నలపై పరిశోధనాత్మక జర్నలిజం చేయాల్సి ఉంది. కానీ ఇవేవీ పట్టకుండా అనేక కోణాల్లో విచారణ తర్వాత సీఐపై సస్పెన్షన్ వేటు వేసిన ఐజీ వంటి ఉన్నతాధికారికి సైతం ‘సామాజిక’ మలినాన్ని అంటిస్తేనే సదరు మీడియా సెక్షన్ ఉపయోగించినటువంటి ‘ఉత్పన్నం’ అనే పదప్రయోగపు ప్రశ్నలు కూడా అనేకం రేకెత్తుతాయి. అవేమిటంటే.. మన జర్నలిజపు పోకడపై, మన సామాజికవర్గంపై కూడా పోలీసు శాఖ ఆరా తీస్తేనే అసలు ‘బాగోతం’ బహిర్గతమవుతుంది. అంతేకాదు ఇటువంటి వార్తా కథనాలు అంతిమంగా సీఐ సత్యనారాయణకు మరింత చేటు చేస్తాయే తప్ప ఏమాత్రం లబ్ధి చేకూర్చవు. అదీ చెప్పదల్చుకున్న అసలు విషయం.

