మరో సీఐపై మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి వేటు వేయనున్నారా? నేడో.. రేపో అధికారికంగా ఇందుకు సంబంధించిన ఉత్తర్వు రానుందా? అంటే ఔననే చర్చ జరుగుతోంది ఖమ్మం జిల్లా పోలీస్ శాఖలో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు సీఐ బత్తుల సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ బుధవారం ఉత్తర్వు జారీ అయిన నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో కూడా ఓ సీఐపై శాఖాపరమైన విచారణ జరుగుతోందని, ఆయనపై చర్య తీసుకునే అవకాశం ఉందనే అంశం చర్చల్లోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెడితే..
ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఓ సీఐ మెడకు గతంలో నమోదైన గంజాయి కేసు ఒకటి చుట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఆయన వ్యవహరించినట్లు పేర్కొంటున్న తీరుపైనా, సీఐపై వచ్చిన ఆరోపణలపైనా శాఖాపరమైన విచారణ దాదాపుగా పూర్తి కావచ్చినట్లు సమాచారం. ఆరోపణల అంశంలో విచారణాధికారులకు ఆధారాలు కూడా లభ్యమైనట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల్లో ఆ సీఐపై బదిలీ వేటు వేస్తారా? లేక సస్పెన్షన్ వంటి చర్య తీసుకుంటారా? లేదంటే సెలవులో వెళ్లాలని ఆదేశాలిస్తారా? అనే ప్రశ్నలపై పోలీస్ శాఖలో భిన్న చర్చ జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత రావచ్చని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.


