Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

Phone Tapping Case: గోనె ప్రకాశరావు చెప్పిందల్లా నిజమే అవుతుందా?

(By Dr. Mohammed Rafee)
గోనె ప్రకాశరావు అంతే. భయపడటాలు లేవు. బెదిరిపోవడాలు లేనే లేవు. అంత ఖుల్లం ఖుల్లా. తెలిసింది తెలిసినట్లు, ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తారు! కొండొకచో అరటి పండు వలచినట్లు, బట్టలు ఉతికి తీగపై ఆరేసినట్లే.

ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో గోనె ప్రకాశరావు నిన్న సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఎన్నికల ముందు నుంచి ఆయన ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఇది మహా గోప్యత వ్యవహారం. కేసీఆర్ చుట్టూ ఫోన్ వైర్ మెల్ల మెల్లగా చుట్టుకుంటోంది! మొత్తం 615 మంది రాజకీయ నాయకులు, అధికారులు, మీడియా అధినేతలు, సినీ నటులు, వ్యాపారవేత్తలు, కొంతమంది పౌరహక్కుల నేతలు తదితరుల ఫోన్లను ట్యాప్ చేశారు. ఇందులో ప్రధాన సూత్రధారి ప్రభాకరరావు నోరు మెదపక పోయినా ఇప్పటికే పూర్తి ఆధారాలు సేకకరించినట్లు సమాచారం. ప్రణీత్ రావు తదితరులు అప్రూవర్లుగా మారడంతో మొత్తానికి ‘వ్యవహారం’ కొలిక్కి వచ్చేస్తోంది. మాజీ డీజీపీ చుట్టూ కథ తిరుగుతోంది. ఆ కథ వెనుక ఉన్నది కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులే కీలకమని చెబుతున్నారు.

ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఇలా ఫోన్ ట్యాపింగ్ కేసులు వెలుగులోకి రావడం ఇది మూడవసారి. గతంలో 1972లో అమెరికాలో రిపబ్లికన్ పార్టీ ఎన్నికల ముందు గెలుపు కోసం ఫోన్ ట్యాపింగ్ చేసి దొరికిపోయింది. ఇండియాలో 1988లో కర్ణాటకలో అప్పటి రామకృష్ణ హెగ్డే ప్రభుత్వం ఇలాంటి కేసులో ఇరుక్కుంది. దాదాపు ఇదే కోవలో 2023లో కేసీఆర్ ఈ కేసులో ఇరుక్కున్నారు!

గోనె ప్రకాశరావు అప్పుడెప్పుడో 1983లో సంజయ్ విచార్ మంచ్ తరపున స్వతంత్ర అభ్యర్థిగా పెద్దపల్లి ఎమ్మెల్యే గా గెలిచారు. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ చైర్మన్ గా పని చేశారు. అంతకు మించి ఆయన ఏమీ చేయకపోయినా ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ఏదైనా సరే సూటిగా మాట్లాడతారు. కుండబద్దలు కొట్టినట్లే ఉంటుంది. గోనె 1982 నుంచి 2005 వరకు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉండి అన్నీ గమనిస్తూ ప్రతి ఒక్కరి తప్పుల చిట్టా తన మైండ్ లో పెట్టుకున్నారు. నిన్న సిట్ విచారణ తరువాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. ఇక ఈ కేసులోంచి కేసీఆర్ ను ఎవ్వరూ కాపాడలేరని ఆయన జోస్యం చెప్పేశారు. అంతేకాదు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావు ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా నిజాలు చెప్పక తప్పదని, జూలై 5 తరువాత ఆయన్ని అరెస్ట్ చేస్తారని కూడా గోనె ప్రకాశరావు చెప్పారు.

ప్రధానమంత్రి కావాలనే లక్ష్యంతో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చి చుట్టు పక్కల రాష్ట్రాలు పర్యటిస్తూ, ఇక్కడ అందరి ఫోన్లు ట్యాప్ చేయించి పూర్తిగా ఇరుక్కుపోయారని గోనె ప్రకాశరావు తెలిపారు. మూడవసారి ఎలాగైనా అధికారంలోకి వస్తామనే నమ్మకంతో పెద్దగా జాగ్రత్తలు తీసుకోలేదని, ఆ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు ఇరుక్కుపోయారని ఆయన విశ్లేషించారు. కేంద్రం జోక్యం చేసుకుని చిత్తశుద్ధితో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని, ఇందుకు స్థానిక బీజేపీ నేతలు కృషి చేయాలని కోరారు.

గోనె ప్రకాశరావుకు ఇక్కడే కాదు, అమెరికాలోనూ మన తెలుగు వారిలో అమితమైన క్రేజ్ ఉంది. తానా, అటా సంస్థలు నిర్వాహించే పొలిటికల్ సెషన్స్ లో ప్రతి ఏటా ప్రకాశరావు ప్యానెల్ స్పీకర్ గా ఉండి తీరాల్సిందే. ప్రకాశరావు మాటలు కూడా అంతే ఆసక్తిగా అక్కడ వింటూ ఎంజాయ్ చేస్తుంటారు. నేను చాలాసార్లు అక్కడ ప్రత్యక్షంగా చూశాను. రాజకీయాల్లో ఇలాంటి నేతల అవసరం వుంది. కానీ ఇలాంటివారికి పార్టీలు సీట్లు ఇవ్వరు. ఇచ్చినా ప్రజలు గెలిపించరు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా నిక్కచ్చి గా, నిజాయితీగా ఉంటారు. డబ్బులు పంచరు. అది మన జనానికి నచ్చదు.

Popular Articles