Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

‘ఫోన్ ట్యాపింగ్’లో తప్పక చదవాల్సిన సీన్లు

సీన్ నెం. 1:
సరిగ్గా ఆరున్నర సంవత్సరాల క్రితం.. 2018 ఎన్నికల సందర్భంగా నేను పనిచేస్తున్న ఓ పత్రిక ఛైర్మెన్ నాకు ఫోన్ చేసి మీ జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఫలానా నాయకుడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, నువ్వు ఆయన దగ్గరకు వెళ్లి ఓసారి మాట్లాడించు.. అని ఆదేశించారు. నేను ఆయా కీలక నేత వద్దకు వెళ్లి మా చైర్మెన్ గారి ఫోన్ ఎత్తడం లేదుట.. ఎందుకు? అని ప్రశ్నించాను. ‘మీ ఛైర్మెన్ గారికి ఫోన్ కలుపు అన్నా..’ అని ఆ కీలక నేత కోరడంతో నా మొబైల్ ద్వాారా ఆయా కీలక నేత పత్రిక ఛైర్మెన్ తో మాట్లాడారు. ఆ తర్వాత కీలక నేత చేసిన కామెంట్ ఏమిటో తెలుసా..? మీ ఛైర్మెన్ ఎప్పుడు నాతో మాట్లాడాలనుకున్నా నువ్వే నా ఆఫీసుకు వచ్చి నీ మొబైల్ ద్వారా మాట్లాడించు.. అన్నారు. ఎందుకూ..? అని నేను ప్రశ్నించగా, ‘నా మొబైల్ ఫోన్ నా నియంత్రణలో లేదు.. అందుకు’ అని ఆ కీలక నేత విషయాన్ని చెప్పకనే చెప్పారు.

సీన్ నెం. 2:
ప్రస్తుత ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి ఓ నాయకుని క్యాంప్ ఆఫీసుకు ఒకింత అసహనంతో వెళ్లాను. అప్పట్లో ఆయన బీఆర్ఎస్ లోనే ఉన్నారు. నేను వెళ్లగానే ‘రా అన్నా.. కూర్చో.. టిఫిన్ చెయ్..’ అని డైనిగ్ డేబుల్ పైకి ఆహ్వానించారు. అసహనంతో వెళ్లిన నేను ఆయన పలకరింపుతో కూల్ అయ్యాను. టిఫిన్ మర్యాద బాగానే ఉందిగాని, మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల పొద్దున్నే ఇంతదూరం రావలసి వచ్చింది.. అన్నాను నేను. నా ఫోన్ ట్యాపింగ్ లో ఉందన్నా.. ఏదైనా మాట్లాడాలనుకుంటే నేరుగా క్యాంప్ ఆఫీసుకే వచ్చెయ్..’ అని కడుపునిండా టిఫిన్ పెట్టి, కుశల ప్రశ్నలు వేసి మరీ పంపించారు ఆ నాయకుడు.

సీన్ నెం. 3:
రాష్ట్రంలో 2018 అసెంబ్లీ ఎన్నికల మహాసంగ్రామం జరుగుతోంది. మహాకూటమి తరపున ఖమ్మం నుంచి టీడీపీ నేత నామ నాగేశ్వర్ రావు ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు. ఆయన ఎన్నికల ఖర్చులకు సంబంధించిన డబ్బు అందడం లేదని టీడీపీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయి. ఒకానొక దశలో తమకు డబ్బు పంపిణీ చేయలేదని ఖమ్మం నియోజకవర్గంలోని ఒకటి, రెండు ప్రాంతాలకు చెందిన ఓటర్లు నామ నాగేశ్వర్ రావు ఇంటి ముందు ఆందోళనకు దిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఓటు అమ్ముకోవడమే ఆత్మవంచనగా సూక్తులు చెబుతున్న పరిస్థితుల్లో ఓటర్లే వచ్చి తమ ఓట్లకు డబ్బు రాలేదని నామ నాగేశ్వర్ రావు ఇంటి ముందు భారీ ఎత్తున ఆందోళనకు దిగడం ప్రజాస్వామ్యప్రియులను కలవరపరిచింది. ఇంతకీ ఏం జరిగిందో తెలుసా? నామ నాగేశ్వర్ రావు క్యాంపునకు చేరాల్సిన కోట్ల రూపాయల నగదు వరంగల్ మహానగరం పరిసరాల్లో పోలీసులకు పట్టుబడింది. మూడో కంటికి తెలియకుండా అత్యంత రహస్యంగా ఇద్దరు నాయకుల కనుసన్నల్లో మాతరమే డబ్బు రవాణా చేస్తున్నప్పటికీ పోలీసులకు పట్టుబడడం ఇప్పటికీ నామ నాగేశ్వర్ రావు క్యాంపునకు బోధపడలేదని చెబుతుంటారు.

సీన్ నెం. 4:
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దె దించుతానని, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఏఒక్క బీఆర్ఎస్ అభ్యర్థినీ అసెంబ్లీ గేట్ తాకనివ్వనని సవాల్ చేసి మరీ పొంగులేటి కాగ్రెస్ తరపున ఎన్నికల బరిలోకి దిగిన దృశ్యం అది. పొంగులేటిని ఆర్థిక దిగ్బంధనం చేశారనే ప్రచారం జరిగిన ఆయా పరిస్థితుల్లో అత్యంత రహస్యంగా ఎన్నికల ఖర్చుకోసం కొంత డబ్బును ఖమ్మం తరలిస్తున్నారు. తన సమీప బంధువైన నివాసం నుంచి తరలిస్తున్న డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పొంగులేటి బంధువు నివాసం నుంచి డబ్బును తరలిస్తున్న వాహనం బయలుదేరిన నిమిషాల వ్యవధిలోనే పోలీసులకు పట్టుబడడం గమనార్హం. వాహనంలో డబ్బున్న విషయం డ్రైవర్ కే తెలియదని, విషయం పోలీసులకు ఎలా తెలిసిందనే అంశంపై అప్పట్లో పొంగులేటి క్యాంపు కార్యాలయ వర్గాలు నివ్వెరపోయాయి.

సిట్ కు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్

విషయం అర్థమైనట్లే కదా..? అంతా ఫోన్ ట్యాపింగ్ మహిమ. ప్రత్యర్థి పార్టీలే కాదు, అధికార పార్టీకి చెందిన బీఆర్ఎస్ నాయకులు సైతం ఆయా రెండు ఎన్నికల సందర్భంగా గజగజా వణికిపోయిన పరిస్థితులు అవి. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులకు వాంగ్మూలం ఇచ్చిన తర్వాత పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిన్న చెప్పింది కూడా దాదాపుగా ఇదే సారాంశం. కాంగ్రెస్ పార్టీకి చెందిన 650 మంది నాయకులతోపాటు బీజేపీ, టీడీపీ నేతల ఫోన్లను కూడా అప్పటి ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఆయన ఆరోపించారు. హోదా లేకపోయినా ప్రభాకర్ రావు అనే పోలీసు అధికారిని ఎస్ఐబీ చీఫ పోస్టులో కూర్చోబెట్టి ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆయన అన్నారు. ట్యాపింగ్ అంశంలో నక్సల్స్ సమస్యను బూచీగా చూపి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతటి అరాచకానికి పాల్పడినట్లు కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ లనే గాక సంబంధిత అధికారులను శిక్షించాలని పీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు.

ఫోన్ ట్యాపింగ్ అంశంలో తాజా సంచలనం ఏమిటంటే.. తెలంగాణాలో వైఎస్ షర్మిల ఫోన్ ను కూడా ట్యాప్ చేసి, ఆమె సంభాషణల రికార్డులను జగన్ కు చేరవేశారనే సారాంశంతో వార్తలు వచ్చాయి. జగన్ కోసం కేసీఆర్ పోలీసులు ట్యాపింగ్ ఆపరేషన్ నిర్వహించినట్లు ప్రముఖ పత్రికలు నివేదించాయి. తద్వాారా షర్మిల ప్రతి కదలికను జగన్ కు చేరవేశారని, ఇందుకు సంబంధించి సిట్ ఆధారాలనే సేకరించినట్లు ఆయా వార్తల సారాంశం. మరోవైపు కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత ఫోన్ ను కూడా ట్యాప్ చేశారనే సారాంశంతో ఇప్పటికే పలు మీడియా సంస్థలు వార్తా కథనాలను వెలువరించడం గమనార్హం.

మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ‘సిట్’ విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజకీయ నాయకులే కాదు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, జర్నలిస్టులు, చివరికి సినిమా వాళ్లు కూడా ఫొన్ ట్యాపింగ్ బాధితులుగా మారినట్లు వార్తలు వస్తున్నాయి. అడ్డూ, అదుపూ లేకుండా, హద్దులు దాటిన ‘పవర్’ పర్వంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ విచారణలో దోషులకు చట్టపరంగా శిక్ష పడేందుకు ఎంత సమయం పడుతుందోగాని, తాజా పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పాలకులు తెలంగాణా సమాజం ముందు ‘నిందితులు’గా మిగిలారనేది మాత్రం నిర్వివాదాంశం. బహుషా ఇది బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా మరింత నష్టాన్ని కలిగించవచ్చు కూడా.

-ఎడమ సమ్మిరెడ్డి

Popular Articles