ఒక్కోసారి నాయకుడి ‘ఇజ్జత్’ తీయడానికి ప్రత్యర్థి రాజకీయ పార్టీ శ్రేణులు అక్కర్లేదు. సొంత పార్టీకి చెందినవారి అనవసరపు చేష్టలు కూడా ఆ నాయకుడి ఇజ్జత్ పోవడానికి దారి తీస్తుంటాయి. తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి ‘ఇజ్జత్’ తీయడానికి ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులో, కార్యకర్తలో అవసరం లేదు.. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలనేది రాజకీయ పరిశీలకుల భావన. ఇంతకీ ఈ ‘ఇజ్జత్’ సంగతేమిటో తెలుసుకునే ముందు ఓ చిన్న సంఘటనను ముందుగా మననం చేసుకుందాం..
‘సాక్షి’ పత్రికలో నేను విజయవాడ బ్యూరో చీఫ్ గా పని చేసిన సమయంలో ఆ పత్రికలో ముఖ్య బాధ్యతల్లో గల కీలక వ్యక్తి ఒకరు ఉదయమే ఫోన్ చేశారు. ఈ రోజు మెయిన్ ఎడిషన్ ఫస్ట్ పేజీలో ప్రచురించిన ఎడిటోరియల్ పై నీ అభిప్రాయమేంటి? అని అడిగారు. అంత పెద్దాయన ఎడిటోరియల్ గురించి నన్ను అడుగుతారేమిటి? అని నాలో నేనే ప్రశ్నించుకుంటూనే… మీరు పెద్దవాళ్లందరూ కలసి ఆలోచించి, నిర్ణయం తీసుకుని ప్రచురించారు కదా సార్? నా అభిప్రాయంతో పనేముంది..? అని తప్పించుకునే ప్రయత్నం చేశాను. ‘నువ్వు సీనియర్ వని, నిర్మొహమాటంగా చెబుతావని అడిగాను.. నీ ఫీలింగ్ ఏంటో చెప్పకుండా ఎస్కేప్ అవుతున్నావేంటి? చెప్పు నీ అభిప్రాయమేంటో..’ అని గట్టిగా అడిగేసరికి తప్పించుకోలేకపోయాను. ‘నిజం చెప్పమంటారా సార్..?’అని మళ్లీ అడిగాను. చెప్పవయ్యా.. నువ్వు మొహమాటం లేకుండా చెబుతావనే అడుగుతున్నా..’ అని అన్నారు. ‘సర్.. ఈ అంశంలో ఆ ఇంగ్లీష్ పేపర్ వాడు రాసిన వార్తకు ఖండనగా మనం ఏకంగా ఎడిటోరియలే రాశాం. ఆ ఇంగ్లీష్ పేపర్ సర్క్యులేషన్ ఎంత? దాని పాఠకులెంత మంది? ఆ వార్తను చదివిని వాళ్లు ఎందరు? ఇంగ్లీషులో రాసిన విషయాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకున్నవాళ్లు ఎందరో నాకైతే తెలియదు గాని, పన్నెండు లక్షల సర్క్యులేషన్ గల మన పత్రికలో ఫలానా ఇంగ్లీష్ పేపర్ మా నాయకుడి మీద ఫలానా వార్త రాసిందనే విషయాన్ని మనమే ఎక్కువ మందికి చెప్పగలిగాం సర్..ఇదెలా కరెక్ట్ సర్..? మీరు చెప్పమన్నారు కాబట్టి ‘నిజం’ చెప్పాను సర్.. నా అభిప్రాయాన్ని నెగిటివ్ గా తీసుకోవద్దు..’ అని అన్నాను. ‘వార్నీ.. ఈ చిన్న లాజిక్ ను నిన్నటి ఎడిటోరియల్ బోర్డు మీటింగులో ఒక్కరూ చెప్పలేదు?’ అని ఆశ్చర్యపోతూ ఆయన వ్యాఖ్యానించారనేది వేరే విషయం. ఇప్పుడు అసలు విషయంలోకి వెడితే..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో సోమవారం ఏం జరిగింది? ‘ప్రొటోకాల్’ అనే అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఇరువర్గాలను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఫలితంగా ఎక్కువో, తక్కువోగాని ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలకు, నాయకులకు లాఠీ దెబ్బల రుచి తెలిసింది.

ఈ ఘటనలో గులాబీ పార్టీ నాయకుల వాదనేమిటంటే.. సిరిసిల్ల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న తమ నాయకుడు కేటీఆర్ ఫొటోను అధికారిక కార్యక్రమాల్లో వాడడం లేదని, ఇది ప్రొటోకాల్ ఉల్లంఘనే అంటూ బీఆర్ఎస్ నాయకులు పేర్కొంటున్నారు. ఇలా పలు అధికారిక కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో వాడడం లేదని, సంబంధిత అధికారులపై చర్య తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ లోకల్ లీడర్లు రెండు రోజుల క్రితం ఏకంగా ఏస్పీకే ఫిర్యాదు చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు ఎదురు దాడికి దిగారట.

ఇందులో భాగంగానే కాంగ్రెస్ కేడర్ భారీ ఎత్తున సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి బయలుదేరారు. ప్రభుత్వ ప్రాపర్టీ అయిన ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ప్రొటోకాల్ ప్రకారం.. తమ నాయకుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫొటో పెట్టలేదని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా, బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలకు చెందినవారి మద్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుని తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఫొటో పగిలిపోగా, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహించారు. దరిమిలా పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలకు లాఠీ దెబ్బలు తగలగా, సీఐ కృష్ణవేని వేలికి గాయమైంది.
మొత్తంగా ఈ ఉదంతంలో విషయం అర్థమైనట్లేగా..? అసలే కేటీఆర్ నియోజకవర్గం.. అక్కడ చీమ చిటుక్కుమన్నా సహజంగానే మీడియా అటెన్షన్ పెరుగుతుంది. ఇంకేముంది ‘ప్రొటోకాల్’ రగడకు మీడియాలో హైప్ క్రియేటైంది. నిజానికి సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం రేవంత్ రెడ్డి ఫొటో లేదనే విషయం ఇప్పటి వరకు సిరిసిల్ల పట్టణ ప్రజలకు కూడా పూర్తిగా తెలియదు. సోమవారంనాటి స్థానిక కాంగ్రెస్ నేతల రచ్చతో విషయం కాస్తా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. విషయం అర్థమైంది కదా? సీఎం రేవంత్ రెడ్డి ఫొటో ప్రొటోకాల్ అంశం ఇప్పటి వరకు సిరిసిల్లకే పరిమితం.. ఇప్పుడు తెలంగాణా యావత్తు లోక విదితం. ఇప్పుడు చెప్పండి ఇందుకు కారకులెవరో..! ‘సమీక్ష’ కథనపు హెడ్డింగ్, కంటెంట్ సముచితమే కదా!?
-ఎడమ సమ్మిరెడ్డి

