తెలంగాణాలోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో మందుపాతర పేలింది. మావోయిస్టు పార్టీ నక్సలైట్లు గురువారం పేల్చిన ఈ మందుపాతర ఘటనలో ముగ్గురు పోలీసులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ములుగు జిల్లా వాజేడు మండలం చెరుకూరు గ్రామ పంచాయతీ అటవీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ నక్సలైట్ల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు నిర్వహిస్తున్న క్రమంలో నక్సలైట్లు మాటువేసి మందుపాతర పేల్చినట్లు సమాచారం.
‘ఆపరేషన్ కర్రెగుట్ట’ పేరుతో మావోయిస్టుల కోసం ఛత్తీస్ గఢ్ భద్రతా బలగాలు గడచిన 17 రోజులుగా జల్లెడ పడుతున్న సంగతి తెలిసిందే. నిన్న ఇరువర్గాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 25 మంది వరకు నక్సలైట్లు మరణించినట్లు వార్తలు రాగా, అధికార వర్గాలు మాత్రం ఆ సంఖ్యను 22గా ప్రకటించాయి. కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో బాంబులు అమర్చామని, ఇటువైపు ఎవరూ రావద్దని గతంలో మావోలు ప్రకటించిన అటవీ ప్రాంతంలోనే తాజాగా మందుపాతర పేలి ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనను పోలీసులు ధ్రువీకరించలేదు.
