Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

ధన్యజీవి.. వనజీవి రామయ్య: మంత్రి పొంగులేటి

వనజీవి రామయ్య జీవితం స్ఫూర్తిదాయకమని రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలం రెడ్డిగూడెంలో పద్మశ్రీ వనజీవి (దరిపల్లి) రామయ్య పార్థివ దేహానికి మంత్రి పొంగులేటి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వనజీవి రామయ్య మృతి చాలా దురదృష్టకరం, బాధాకరమని అన్నారు. పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య మనకు కని పించని లోకానికేగి దూరమయ్యారని, వారు చేసిన పనులు కలకాలం గుర్తుండిపోతాయని అన్నారు. ప్రభుత్వ పక్షాన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్షాన, స్థానిక శాసనసభ్యునిగా తన పక్షాన వనజీవి రామయ్య ఆత్మ శాంతించాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

మనిషి జీవించినంత కాలం చేసిన మంచి పనులే వారిని చిరస్మరణీయులని చేస్తాయని మంత్రి తెలిపారు. వనజీవి రామయ్య చేపట్టిన కార్యక్రమాలు యావత్తు దేశ ప్రజలు గౌరవించే విధంగా చేశాయన్నారు. వనజీవి రామయ్య చెట్లను పెంచే కార్యక్రమాన్ని జీవిత కాలమంతా చేశారని, ఎన్ని ఇబ్బందులు వచ్చిన, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఆర్థికంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్న, వాటన్నిటినీ అధిగమించి, కోటి మొక్కలకు పైగా నాటారని అన్నారు. వేలాది కోట్ల విత్తనాలను, వందలాది ఎకరాల్లో జీవం పోశారన్నారు.

పచ్చదనాన్ని పెంచడానికి, ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా, ఒక పూట తిన్నా, తినకపోయినా మొక్కలు పెంచాలని, మొక్కలతో వచ్చే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తూ, వారి గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల అటవీ భూములు, ప్రభుత్వ భూములు, ఎక్కడైతే మొక్కను నాటోచ్చో, ఆ ప్రాంతాల్లో మొక్కలు నాటి, ప్రాంతాన్ని అద్భుతంగా పచ్చదనం చేశారని కొనియాడారు. తద్వారా పద్మశ్రీ అవార్డు అందుకున్నారని మంత్రి తెలిపారు.

వనజీవి రామయ్య సతీమణిని ఓదారుస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

వనజీవి రామయ్యకు చిరకాల కోరికలు ఉన్నాయని కుటుంబ సభ్యులు తెలిపారని, వాటన్నిటినీ సాధ్యాసాధ్యాలు పరిశీలించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి, వాటన్నిటిని నెరవేర్చడానికి చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, రూరల్ తహసిల్దార్ రాం ప్రసాద్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Popular Articles