ఆత్మరక్షణ కోసం జరిపిన తుపాకీ కాల్పుల్లో పులి మరణించింది.. అదేమిటీ.. తుపాకీ కాల్పుల్లో పులి మరణించడమేంటీ..? ఎదురుకాల్పుల్లో ఎవరో నక్సలైట్ మరణించినట్లుగా ఉందేమిటీ న్యూస్ కంటెంట్ అనుకుంటున్నారా.? మీరు చదువుతున్న వార్త కరెక్టే. కేరళలో అటవీ అధికారులు తమ ఆత్మరక్షణ కోసం జరిపిన తుపాకీ కాల్పుల్లో ఓ పెద్దపులి మరణించింది. ఇందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటంటే..
కేరళ అడవుల నుంచి జనారణ్యంలోకి వచ్చిన ఓ పులి కొన్ని పశువులను చంపేసింది. జనం బెంబేలెత్తిపోయారు. దీంతో పులిని పట్టుకోవడానికి అటవీ అధికారులు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా సోమవారం పులి కోసం గాలిస్తున్న పరిస్థితుల్లో అది ఓ తేయాకు తోటలో ఉన్నట్లు గుర్తించారు. క్రూర మృగాలను పట్టుకోవడం అంత ఈజీ కాదుగా..? అందుకే ప్రక్రియలో భాగంగా 15 మీటర్ల దూరం నుంచే పులికి మత్తు మందు ఇచ్చేందుకు కాల్పులు ప్రారంభించారు.
ఈ పరిణామాల్లో పులి ఒక్కసారిగా అటవీ అధికారులపైకి దూకింది. దీంతో ఆత్మరక్షణకోసం అటవీ అధికారులు జరిపిన కాల్పుల్లో పులి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మరణించిన పులి వయస్సు పదేళ్ల వరకు ఉంటుందని అటవీ అధికారులు వెల్లడించారు. కేరళలోని ఇడుక్కి జిల్లా వండిపెరియార్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.