Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

పైసల్లేవ్.. అయినా గ్రీన్ ఛానల్ లో ఇస్తాం: మంత్రి పొంగులేటి

ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి మాత్రం గ్రీన్ ఛానల్ లో నిధులు మంజూరు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వైరా మండలం పుణ్యపురంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సీపీ సునీల్ దత్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ లతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మంత్రి పొంగులేటి మంగళవారం భూమి పూజ, శంకుస్థాపన చేసి, ఇందిరమ్మ ఇంటి లబ్దిదారులైన దంపతులకు నూతన వస్త్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, 10 సంవత్సరాలు గత ప్రభుత్వ హయాంలో ప్రజలు పడిన ఇబ్బందులు గమనించి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే పేదలకు ఇందిరమ్మ ఇండ్లను అందించాలనే లక్ష్యంతో 4 లక్షల 50 వేల ఇండ్లను మంజూరు చేశామని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేశామని అన్నారు. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలకు అదనపు ఇండ్లు మంజూరు సైతం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, పేదలకు 4 విడతల్లో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతో సొంత ఇండ్లు అందించే ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని జనవరి 26న రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఒక పైలెట్ గ్రామాన్ని ఎంపిక చేసుకొని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసామని అన్నారు.

ఇంటిలో నివసించే ప్రజలే నిర్మాణం చేసుకునేలా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఇంటి నిర్మాణానికి ఎటువంటి నిబంధనలు లేవని మంత్రి తెలిపారు. పేదలకు 4 విడతలలో ఇందిరమ్మ ఇండ్ల ఆర్థిక సహాయం అందుతుందని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, గ్రీన్ ఛానల్ లో నిధులు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతులకు ఇచ్చిన మాట మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే సారి 21 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేశామని అన్నారు. మార్చి చివరి నాటికి రైతులందరికీ తప్పనిసరిగా రైతు భరోసా నిధులు అందుతాయని మంత్రి తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేందుకు స్థానికంగా ఇసుక తెచ్చుకునేందుకు ఎటువంటి ఇబ్బందులు పెట్టవద్దని మంత్రి సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి పెట్టుబడి పెట్టలేని వారికి మహిళ సంఘాల ద్వారా సాధారణ వడ్డీకి లక్ష రూపాయల రుణం ఇప్పించేందుకు కలెక్టర్ తీసుకున్న చర్యలను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

Popular Articles