ఖమ్మం నగర పోలీసులు ఓ చిట్ ఫండ్ కంపెనీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లను సోమవారం అరెస్ట్ చేశారు. తాము అరెస్టు చేసినవారిలో నిక్షిప్త చిట్ ఫండ్ డైరెక్టర్లు ఉన్నట్లు ఖమ్మం టూ టౌన్ సీఐ బాలకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. గత కొంతకాలంగా నగరంలోని ప్రవేటు చిట్స్ నిర్వహిస్తూ రెండు కోట్ల రూపాయలకు పైగా మోసం చేసి, చిట్టి బాధితుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న నిక్షిప్త చిట్ ఫండ్ డైరెక్టర్లు సంగిశెట్టి కరుణాకర్, మూల ఉమామహేశ్వర్ లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు.
సుమారు 42 మంది చిట్టి బాధితులకు ఇవ్వవలసిన 2 కోట్ల 17 లక్షల రూపాయలు ఇవ్వకుండా సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని తప్పించుకు తిరుగుతున్నారని చెప్పారు. ఇటీవల మరిపెడ బంగ్లాకు చెందిన భూక్యా శ్రీనివాస్ అనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు నగరంలోని వీడివోస్ కాలనీలో ఉన్న వీరిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని చెప్పారు.