ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు డా. పి. శ్రీజ, పి. శ్రీనివాసరెడ్డిలతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ముందుగా కలెక్టరేట్ లోని ప్రజావాణి దరఖాస్తుల నమోదు కంప్యూటర్ సెక్షన్ కు వెళ్లి అర్జీల నమోదును పరిశీలించారు. దరఖాస్తులను స్పష్టంగా కనపడే విధంగా స్కానింగ్ చేయాలని సూచించారు. అనంతరం చేయూత పెన్షన్ సహాయక కేంద్రం తనిఖీ చేసి అవసరమైన సూచనలు చేశారు.
ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, తమ శాఖకు వచ్చిన అర్జీలను మరొకమారు పరిశీలన చేసి, పెండింగ్ లో లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు. సత్తుపల్లి మండలం చెరుకుపల్లి గ్రామ నివాసి తాటి రాములు సర్వే నెంబర్ 113 లో గిరిజనుడైన తన భూమిని గిరిజనేతరులు ఆక్రమించారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, సత్తుపల్లి తహసిల్దార్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

ఖమ్మం కార్పొరేషన్ ప్రకాశ్ నగర్ కు చెందిన సి.హెచ్. విజయ్ కుమార్ తన వ్యాపార నిమిత్తం బ్యాంకు నుండి లోన్ మంజూరు చేయించి దివ్యాంగుల కోటాలో మూడు చక్రాల ఎలక్ట్రిక్ బండి ఇప్పించగలరని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, పీడీ మెప్మా అధికారికి రాస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఖమ్మం నగరానికి చెందిన బత్తుల వినయ్ కుమార్ తాను వంద శాతం దివ్యాంగుడినని, దివ్యాంగుల కోటలో తనకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, మున్సిపల్ కమీషనర్ కు రాస్తూ అవకాశం మేరకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
కల్లూరు మండలం నివాసిని ఎన్. సుజాత ప్రభుత్వ పాఠశాలల్లో ఏడవ తరగతి వరకు చదువుకున్నానని, కల్లూరు లోని నాగార్జున సాగర్ ప్రాజెక్టులో ఉన్న ఇరిగేషన్ కార్యాలయంలో స్వీపర్ పోస్ట్ ఖాళీగా ఉందని దివ్యాంగుల కోటాలో తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా, డీఈ ఎన్.ఎస్.పి. కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ ప్రజావాణిలో డిఆర్వో పద్మశ్రీ, డిఆర్డీవో సన్యాసయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఏవో ఎన్. అరుణ, తదితరులు పాల్గొన్నారు.

