జర్నలిస్టులు రాజకీయ అభిప్రాయాలను కలిగి ఉండడం తప్పు కాదు. కానీ వృత్తిపరంగా విధులు నిర్వహించే సమయంలో తమ రాజకీయ అభిప్రాయాలను ప్రతిబింబించే విధంగా జర్నలిస్టుల రాతలు ఉండకూడదనేది సుస్పష్టం. రాజకీయ రంగంపై మక్కువ పెంచుకునే జర్నలిస్టులు ఏదో ఒక పార్టీలో చేరి ఆ పార్టీ కండువాతో రాజకీయ నాయకుడిగా ఎదగడం కూడా తప్పు పట్టాల్సిన అంశం కాదు. జర్నలిజం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి నాయకులుగా మారి, మంత్రుల స్థాయికి ఎదిగిన జర్నలిస్టులు అనేక మంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటువంటి జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీలో జాతీయ స్థాయి నాయకునిగా ఎదిగి, ఇటీవలి వరకు బీఆర్ఎస్ లో ఉండి, మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరిన కె. కేశవరావు నుంచి టీడీపీలో కాల్వ శ్రీనివాసులు, వైఎస్ఆర్ సీపీలో కురసాల కన్నబాబు, బీఆర్ఎస్ లో చంటి క్రాంతి కిరణ్ వంటి వారు అనేక మంది పూర్వ కాలంలో జర్నలిస్టులే. తమ రాజకీయ అవకాశాలను పరీక్షించుకునేందుకు బీజేపీలో ఎస్. కుమార్, సంగప్ప వంటి మాజీ జర్నలిస్టులు తమదైన శైలిలో కష్టపడుతూనే ఉన్నారు. వీళ్లంతా జర్నలిజాన్ని పూర్తిగా వదిలేసి రాజకీయ రంగంలోకి ప్రవేశించిన వారే. ఇంకొందరు రాజకీయ రంగంలోకి నేరుగా ప్రవేశించినా, అక్కడ ఇమడలేక, తమ గౌరవాన్ని కోల్పోయామనే భావనతో తిరిగి మళ్లీ జర్నలిజం వృత్తినే ఆశ్రయించినవారు ఉన్నారు. ఇటువంటివారీలో స్టాఫ్ రిపోర్టర్, బ్యూరో చీఫ్ స్థాయిల్లో పనిచేసిన జర్నలిస్టులు ఉన్నారు.
కానీ ఖమ్మం జిల్లాలో కొందరు మండల స్థాయి విలేకరులు ద్విపాత్రాభినయం చేస్తున్న తీరు అధికార కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలకు తావు కల్పించడమే కాదు, స్థానికంగా కేడర్ లో వర్గపోరుకు కారణమవుతోంది. ఓవైపు విలేకరులుగా చెలామణిలో ఉంటూనే, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా తమకు తాము ప్రచారం చేసుకుంటున్న తీరు చర్చకు దారి తీయడానికి కారణాలు లేకపోలేదు. దశాబ్దాలుగా పార్టీకోసం పనిచేసినవారిపై ‘పితూరీలు’ చెప్పే స్థాయికి ద్విపాత్రాభినయం చేస్తున్న విలేకరులు దిగజారడంతో పార్టీ కేడర్ లో ఘర్షణ ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే విలేకరులుగా మంత్రుల వంటి నాయకుల వద్ద గౌరవాన్ని పొందుతూ పార్టీ లీడర్ల మధ్య చిచ్చు పెట్టే చర్యలేమిటని కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు ప్రశ్నిస్తున్నారు. కానీ ఈ విషయంలో నేరుగా తమ గోడును వెల్లబోసుకునే పరిస్థితులు లేకపోవడంతో అధికార పార్టీ స్థానిక లీడర్లు మిన్నకుంటూ లోలోనే కుమిలిపోతున్నారు. పార్టీకి చెందిన బడా నాయకులు, మంత్రి స్థాయి లీడర్లు కూడా విలేకరులుగా, రాజకీయ నాయకులుగా ద్విపాత్రాభినం చేస్తున్నవారికి ప్రాధాన్యతనివ్వడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. మచ్చుకు ఒకటి, రెండు ఘటనలను పరిశీలిస్తే…

సత్తుపల్లి నియోజకవర్గంలోని ఓ ప్రధాన పత్రిక మండల విలేకరి స్థానిక కాంగ్రెస్ రాజకీయాల్లో జోక్యం చేసుకుని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన ఘటన కొద్ది నెలల క్రితం తీవ్ర వివాదాస్పదమైంది. కాంగ్రెస్ వర్గాల్లో ఘర్షణకు కూడా దారి తీసింది. ఈ విలేకరి ‘అతి’ ప్రవర్తనపై స్థానిక కాంగ్రెస్ నాయకులు సంబంధిత పత్రిక యాజమాన్యానికి ఫిర్యాదు చేశాయి. ఈ విలేకరి చేస్తున్నట్లు ఆరోపణలు గల ఇసుక దందా, నల్లబెల్లం వ్యాపారం వంటి ‘మాఫియా’ కార్యకలాపాలను, కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపుతున్న ఉదంతాలపై స్థానిక కాంగ్రెస్ నాయకులు కొందరు పత్రిక యాజమాన్యానికి పూసగుచ్చినట్లు వివరిస్తూ ఫిర్యాదు చేశాయి. దీంతో ఈ విలేకరిని పక్కనబెడుతూ యాజమాన్యం చర్య తీసుకుంది. కానీ కొద్దిరోజుల వ్యవధిలోనే ఓ మంత్రి సిఫారసుతో మళ్లీ ఆ విలేకరిని అక్కడే నియమించినట్లు జరుగుతున్న ప్రచారం స్థానిక కాంగ్రెస్ నాయకులను ఆశ్చర్యపరిచింది.
అదేవిధంగా పాలేరు నియోజకవర్గంలోనూ ఒకరిద్దరు జర్నలిస్టులుగా, కాంగ్రెస్ పార్టీ రాజకీయ నాయకులుగా చెలామణి అవుతున్న తీరు అధికార పార్టీ కేడర్ లో తీవ్ర అసహనానికి దారి తీస్తున్నదట. పాలేరు నియోకవర్గానికి తాను మరో తీన్మార్ మల్లన్నగా తనకు తాను ప్రచారం చేసుకుంటూ రెడ్డి, కమ్మ సామాజిక వర్గ నాయకులపై నోరు పారేసుకుంటున్నట్లు ఆరోపణలు గల ఈ విలేకరి తీరుపై స్థానిక కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్లు భిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో వాడుకుంటూ, రాజకీయ నాయకుడిగా చెలామణిలో గల ఒకరిద్దరు స్థానిక విలేకరులు తీన్మార్ మల్లన్న తనకు ప్రేరణగా చెప్పుకుంటూ, అతని భాష తరహాలోనే కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలపై ఈ జర్నలిస్ట్ కమ్ పొలిటీషియన్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్లు స్థానిక కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలు పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ కేడర్ లో భిన్న వాదనలకు తావు కల్పిస్తున్నాయి. పొంగులేటి ఆర్థిక సాయంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టెక్కినట్లు ప్రచారంలో గల తీన్మార్ మల్లన్న తరహాలోనే మంత్రి పేరు చెప్పుకుని కాంగ్రెస్ లీడర్ గా ప్రాచుర్యంలో గల ఈ విలేకరి మంత్రి సామాజికవర్గాన్నేగాక, జిల్లాలో బలమైన ‘కమ్మ’ సామాజిక వర్గంపైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్లు విమర్శలున్నాయి.
మొత్తంగా ఖమ్మం జిల్లాలో కొందరు మండల స్థాయి విలేకరులు ఓవైపు రాజకీయ నాయకులుగా, మరోవైపు విలేకరులుగా ద్విపాత్రాభినయం చేస్తూ అధికార కాంగ్రెస్ పార్టీలో చిచ్చుకు కారణమవుతున్నట్లు పేర్కొంటున్న ఉదంతాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇటువంటి వ్యక్తులు ఏదో ఒక రంగాన్ని మాత్రమే ఎంచుకోవాలని, రాజకీయమా? జర్నలిజమా? తేల్చుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఇటువంటి ద్విపాత్రాభినయ వ్యక్తులను ప్రోత్సహించే నాయకులు సైతం పునరాలోచన చేయకపోతే అది అంతిమంగా వారికేగాకుండా, పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందనే అభిప్రాయాలను కాంగ్రెస్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

