పెద్దగట్టు (గొల్లగట్టు) జాతరకు భారీగా నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి కోరారు. హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన రఘువీర్ రెడ్డి ఈ మేరకు విన్నవించారు. ఇందుకు స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 16 నుంచి పెద్దగట్టు జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లకు కావాల్సిన నిధుల ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
జాతరకు భారీగా భక్తజనం తరలిరానున్న నేపథ్యంలో మౌలిక వసతులు, విద్యుత్ సౌకర్యం, తాగునీరు తదితర ఏర్పాట్లు చేయనున్నారు. గత ప్రభుత్వాల హయాంలో తాత్కాలిక ఏర్పాట్లు చేసి చేతులు దులుపుకున్నారని, కానీ ఈసారి శాశ్వత ప్రాతిపదికన పనులు చేయాలని సీఎం సూచించారు. అవసరమైన చోట సీసీ రోడ్లు వేయాలన్నారు.
యాదవ సంఘం నాయకులు, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు గౌని రాజారామ్ రమేష్ యాదవ్, యూత్ కాంగ్రెస్ నాయకులు, తదితరులు పెద్దగట్టు జాతరకు సౌకర్యాలు కల్పించేలా నిధులు విడుదల చేయాలని తనను కోరుతూ వినతి పత్రం సమర్పించిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పెద్దగట్టు జాతరకు నిధులు విడుదల చేయాలని ఎంపీ రఘువీర్ రెడ్డి కోరారు. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే అధికారులకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, నిధులు వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు..