వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రాబల్య ప్రాంతంలో ‘గొడ్డు’ ఆయిల్ పామ్ మొక్కల బాగోతం కలకలం రేపుతోంది. ఇప్పటికే అనేక మంది ఆయిల్ పామ్ సేద్యపు రైతుల పుట్టి ముంచిన ‘గొడ్డు’ మొక్కల కొనుగోళ్ల వ్యవహారంపై ప్రస్తుత పాలకులు పెద్దగా స్పందించకపోవడమే అసలు విశేషం. ‘గొడ్డు’ మొక్కల సరఫరా కారణంగా తనకు రూ 60.00 లక్షల నష్టం వాటిల్లిందని ఏకంగా ఓ రైతు హైకోర్టును ఆశ్రయించిన పరిణామాలు ఆయిల్ పామ్ మొక్కల కొనుగోళ్ల తీరును సైతం వేలెత్తి చూపుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకటి కాదు రెండూ కాదు.. ఒక కోటి మొక్కల కొనుగోళ్ల వ్యవహారంలో మున్ముందు పరిస్థితిని తలచుకుని ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

తాజాగా వెలుగు చూసిన ఉదంతంలో అక్షరాల 4.00 లక్షల ‘మొలక విత్తనాలు’ కాపు కాయని ‘గొడ్డు’ రకంగా అధికారులే తేల్చారు. గులాబీ సర్కారు హయాంలో జరిగిన ఈ ‘గొడ్డు’ మొక్కల బాగోతానికి బాధ్యులెవరు? అందుకు దారి తీసిన పరిస్థితులేమిటి? అనే అంశాలను నిగ్గు తేల్చడానికి కాంగ్రెస్ పాలకులు పెద్దగా చొరవ చూపకపోవడంపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఇటీవలి కాలంలో ఆయిల్ పామ్ సాగు చేయాలని రాష్ట్ర రైతాంగాన్ని పదే పదే కోరుతున్న సంగతి తెలిసిందే. రాబోయే కాలంలో రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యమని, రాష్ట్రం నలుమూలలా పామాయిల్ ఫ్యాక్టరీల ఏర్పాటుతో కర్షక కుటుంబాలు సంతోషంగా జీవించేలా చూడడమే తన ఆశయమని మంత్రి తుమ్మల అనేక సభల్లో పదే పదే పునరుద్ఘాటిస్తున్నారు. నిజానికి మంత్రి లక్ష్యంలో తప్పు పట్టాల్సిన అంశమేమీ లేదు.
కానీ తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన సత్తుపల్లి నియోజకవర్గంలోని రేగళ్లపాడు ఆయిల్ ఫెడ్ నర్సరీలో వెలుగు చూసిన ‘గొడ్డు’ (ఆఫ్ టైప్) మొక్కల బాగోతం రాష్ట్ర రైతాంగాన్ని తీవ్రంగా కలవరపరుస్తోంది. మొక్కలు ఆఫ్ టైప్ గా తేలితే రైతులకు ఒనగూరే నష్టమేంటి? అనే ప్రశ్నకూ అర్థముంది. ఇప్పటి వరకు వెలుగు చూసిన నాలుగు లక్షల ‘గొడ్డు’ మొక్కలవల్ల సుమారుగా రూ. 2.50 కోట్లు నష్టం ఆయిల్ ఫెడ్ సంస్థకు మాత్రమేనంటున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా సత్తుపల్లి తదితర ప్రాంతాల్లోనే 30 మంది రైతులు దాదాపు వెయ్యి ఎకరాల్లో నాటిన 2019 బ్యాచ్ మొక్కలు ‘గొడ్డు’ రకంగా తేలాయని రైతాంగ వర్గాలు చెబుతున్నాయి. మొక్కలు నాటి నాలుగేళ్లు దాటినా ఆయిల్ పామ్ గెలలు కాపు కాసిన దాఖలాలు లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు.

వాస్తవానికి ఐదేళ్ల క్రితమే ఈ ‘గొడ్డు’ రకం మొక్కల బాగోతం వెలుగు చూసింది. ఆయిల్ ఫెడ్ సంస్థ తనకు సరఫరా చేసిన మొక్కలు నాలుగేళ్ల తర్వాత కూడా కాపు కాయక పోవడంతో నారాయణపురానికి చెందిన పుచ్చకాయల సోమిరెడ్డి అనే రైతు హైకోర్టును ఆశ్రయించారు. ఆయిల్ ఫెడ్ నిర్వాకం వల్ల తాను 12 ఎకరాల్లో సాగు చేసిన ఆయిల్ పామ్ మొక్కలు నిర్వీర్యమయ్యాయని, కాపు కాయలేదని, తనకు రూ . 60.00 లక్షల నష్టం వాటిల్లిందని ఆయన కోర్టుకు విన్నవించుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు విచారణలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు 2019 బ్యాచ్ లో వెలుగు చూసిన ఘటనల్లో దాదాపు వెయ్యి ఎకరాల్లో 30 మంది రైతులు ఇదే విధంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రాతిపదికన రూ. 50.00 కోట్ల వరకు ఆయా రైతులు నష్టపోయినట్లు ఓ అంచనా.
ఉక్రెయిన్ – రష్యా దేశాల మధ్య మొదలైన యుద్ధ పరిణామాల కారణంగా 2001లో టన్ను ఆయిల్ పామ్ గెలల ధర రూ. 23,486 పలికింది. దీంతో ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ 2022-23 సంవత్సరంలో కోటి ఆయిల్ పామ్ ‘విత్తన మొలక’లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంది. భారీ అంచనాతో కోటి మొక్కలను దిగుమతి చేసుకున్న ఆయిల్ ఫెడ్ సంస్థ సామర్థ్యం లేని కంపెనీలకు విత్తన మొలకల కోసం ఆర్డర్ ఇచ్చినట్లు రైతులు పేర్కొంటున్నారు. ఉదాహరణకు ఐదు వేల విత్తన మొక్కలను మాత్రమే సరఫరా చేసే సామర్ధ్యం గల కంపెనీకి ఐదు లక్షల విత్తన మొలకలకు ఆర్డర్ ఇచ్చినట్లు రైతు వర్గాల కథనం. అప్పట్లో అంటే 2019లో దిగుమతి చేసుకున్న పాత బ్యాచ్ మొక్కల్లోనే 30 నుంచి 40 శాతం ‘గొడ్డు’ రకంగా దశలవారీగా బహిర్గతమవుతున్నట్లు రైతుల పేర్కొంటున్నారు. ఈ మొక్కలను ఆయిల్ పామ్ సాగు చేసేందుకు ముందుకొచ్చిన రైతులందరికీ సరఫరా చేశారు. అయితే నాటిన నాలుగేళ్ల తర్వాతగాని అవి కాపు కాసే మొలక విత్తనాలేనా? లేక ‘గొడ్డు’ రకమా? అనే విషయం తేలడం లేదు.

ఇక విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న కోటి మొక్కల్లో గొడ్డు రకం మొక్కలు ఎన్ని? అనేది తేలడానికి మరింత వ్యవధి పడుతుంది. 2022-23 సంవత్సరంలో దిగుమతి చేసుకున్న మొక్కలను మహబూబ్ నగర్, మహబూబాబాద్, మెదక్, సిద్ధిపేట తదితర జిల్లాలకు కూడా సరఫరా చేశారు. తాజా పరిణామాల్లో ఆయా ప్రాంతాల్లోని రైతులు తీవ్ర ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగేళ్లు దాటితే తప్ప ఫలితమేంటో తెలియని స్థితి ఉండడంతో ఇప్పటికే సాగు చేస్తున్న రైతులు తీవ్ర కలవరానికి గురవుతున్నారు.
కాగా ఆయిల్ ఫెడ్ సంస్థ సరఫరా చేస్తున్న మొక్కల్లోనే ఎక్కువగా ‘గొడ్డు’ రకం తేలుతుండడం గమనార్హం. ప్రయివేట్ కంపెనీలు సరఫరా చేస్తున్న ఆయిల్ పాం మొక్కల్లో కేవలం ఐదు శాతం మాత్రమే ‘గొడ్డు’ రకంగా తేలుతున్నాయని రైతులు చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పెద్ద ఎత్తున అంటే కోటి మొక్కలను కొనుగోలు చేశారని, నాటిన వ్యవధిని బట్టి దశలవారీగా ‘గొడ్డు’ రకం మొక్కల బాగోతం వెలుగు చూస్తోందని రైతులు చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో విదేశాల నుంచి కొనుగోలు చేసిన విత్తన మొక్కల కొనుగోళ్లపై విచారణ జరిపి, బాధ్యులపై చర్య తీసుకోవడంతోపాటు రైతులకు నష్ట పరిహారం చెల్లించాలనే డిమాండ్ కర్షక వర్గాల నుంచి వస్తోంది.

మొత్తంగా సత్తుపల్లి ప్రాంతంలోని ఆయిల్ ఫెడ్ సంస్థకు చెందిన రేగళ్లపాడు నర్సరీలో వెలుగు చూసిన 4 లక్షల ‘గొడ్డు’రకం ఆయిల్ పాం మొక్కల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.తాజా పరిణామాల్లో ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకొచ్చే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. తన సొంత మండలం సమీపంలోనే, తాను గతంలో ప్రాతినిధ్యం వహించిన సత్తుపల్లి ప్రాంతంలోనే చోటు చేసుకున్న ఈ పరిణామంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు స్పందించి తమకు న్యాయం చేయాలని నష్టపోయిన రైతులు డిమాండ్ చేస్తున్నారు.

