ఛత్తీస్ గఢ్ అడవుల్లో మావోయిస్టుల ఆనవాళ్లను భద్రతా బలగాలు గునపాలతో ధ్వంసం చేస్తున్నాయి. నక్సలైట్ల ఏరివేతలో భాగంగా దండకారణ్యం అడవులను జల్లెడ పడుతున్న పోలీసులు ఎన్కౌంటర్లలో మరణించిన నక్సలైట్ల స్మారక స్తూపాలను కూడా కూల్చివేస్తున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణా – ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లోని నక్సల్స్ నిర్మించిన వివిధ కట్టడాలను గుర్తించాయి.

తాజాగా బీజాపూర్ అడవుల్లో భద్రతా బలగాలు మావోయిస్టుల శిక్షణా శిబిరాన్ని గుర్తించాయి. ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ స్మారక స్తూపాన్ని కూడా గుర్తించిన భద్రతా బలగాలు వాటిని ధ్వంసం చేశాయి. దాదాపు 1.20 ఎకరాల విస్తీర్ణంలో గల నక్సలైట్ల ట్రెయినింగ్ సెంటర్ లో నిర్మించిన శాశ్వత గుడిసెలను, సెంట్రింగ్ పాయింట్లను, ఇతరత్రా వసతుల నిర్మాణాలను భద్రతా బలగాలు కూల్చివేశాయి. బీజాపూర్ జిల్లా భట్టి గూడ అడవుల్లో నిర్మించిన నక్సల్స్ ట్రెయినింగ్ సెంటర్ ఆనవాళ్లు లేకుండా పోలీసు బలగాలు ధ్వంసం చేశాయి.
నక్సలైట్లు తమ కేడర్ కోసం నిర్మించిన ట్రెయినింగ్ సెంటర్ ను భద్రతా బలగాలు ధ్వంసం చేస్తున్న దృశ్యాన్ని ఈ దిగువన గల వీడియలో చూడవచ్చు..

