Sunday, January 25, 2026

Top 5 This Week

Related Posts

మానవత్వం చాటుకున్న తహశీల్దార్ విక్రమ్ కుమార్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక తహశీల్దార్ విక్రమ్ కుమార్ మానవత్వాన్ని చాటుకున్నారు. పోడు భూమి సమస్యపై తీవ్రంగా కలత చెంది నిండు ప్రాణాన్ని తీసుకున్న గిరిజనుడు సురేష్ కుటుంబ పరిస్థితిని చూసి తహశీల్దార్ విక్రమ్ కుమార్ తీవ్రంగా చలించారు. వివరాల్లోకి వెడితే… మండలంలోని మల్లారం గ్రామానికి వలస వచ్చిన గొత్తికోయ గిరిజనుడు కుంజా సురేష్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాను పోడు చేసి సాగులోకి తీసుకొచ్చిన భూమిలో ఇతరులు విత్తనాలు చల్లారని, ఇక తనకు ఆ భూమి చెందదనే ఆందోళనకు గురయ్యారు. దీంతో సురేష్ ఆత్మహత్యకు పాల్పడి అసువులు తీసుకున్నారు.

సురేష్ భార్యకు ఆర్థిక సాయం అందిస్తున్న తహశీల్దార్ విక్రమ్ కుమార్

అయితే ఘటనా స్థలికి వెళ్లిన పినపాక తహశీల్దార్ విక్రమ్ కుమార్ సురేష్ కుటుంబ దీనస్థితిని చూసి కలత చెందారు. సురేష్ భార్య సమ్మక్క తన నలుగురు పిల్లలతో కన్నీరు మున్నీరవుతున్న హృదయ విదారక దృశ్యాన్ని చూసి ఆయన చలించారు. సురేష్ దహన సంస్కారాల ఖర్చులు కూడా లేని సమ్మక్క ఆర్థిక స్థితి, దుఃఖం గురించి తెలుసుకున్న తహశీల్దార్ విక్రమ్ స్పందించారు. ఈమేరకు సురేష్ మృతదేహం దహన ఖర్చులకు, నిత్యావసర సరుకుల కోసం రూ. 10 వేల నగదును అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. అంతేకాదు ప్రభుత్వం తరపున అపద్బంధు పథకం కింద కూడా సాయం అందేలా చూస్తానని తహశీల్దార్ విక్రమ్ కుమార్ భరోసా కల్పించారు. ఆపద సమయంలో ఆదుకున్న తహశీల్దార్ విక్రమ్ కుమార్ ను ఈ సందర్భంగా పలువురు స్థానికులు ప్రశంసించారు.

Popular Articles