Sunday, January 25, 2026

Top 5 This Week

Related Posts

సీపీఐ సీనియర్ నేత గుండా మల్లేశ్ మృతి

గ‌త‌కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న సీపీఐ సీనియార్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మ‌ల్లేశ్‌ ఇకలేరు. హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలం రేచిని గ్రామంలోని కార్మిక కుటుంబానికి చెందిన గుండా మల్లేశ్ అంచెలంచెలుగా శాసన సభ్యుడి స్థాయికి ఎదిగారు.

మెట్రిక్యులేషన్ వరకు చదివిన మల్లేశ్ బెల్లంపల్లిలోని రామా ట్రాన్స్‌పోర్టులో క్లీనర్‌గా, డ్రెవర్‌గా కూడా పనిచేశాడు. ఆ సమయంలో తోటి క్లీనర్లు, డ్రెవర్ల సమస్యలపై పోరాడారు. తర్వాత సింగరేణిలో కార్మికుడిగా చేరిన ఆయన సీపీఐలో సభ్యత్వం తీసుకొని, పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. అనంతరం 1970లో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారారు.

మంచి కార్మిక నేతగా పేరు తెచ్చుకున్న ఆయన 1983లో బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. తర్వాత 1985, 1994, 2009 ఎన్నికల్లోనూ గెలిచారు. 2009లో సీపీఐ శాసనసభాపక్ష నాయకుడిగా వ్యవహరించారు. నిమ్స్ లో మల్లేశ్ భౌతికకాయానికి సీపీఐ సీనియర్ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి, చాడ వెంకట్ రెడ్డి నివాళులర్పించారు.

సీఎం కేసీఆర్ సంతాపం:
సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. నాలుగుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన మల్లేశ్ తో తనకున్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. మల్లేశ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Popular Articles