Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

సొంత ‘కమాండర్’ను చంపిన నక్సల్స్!?: బస్తర్ ఐజీ సంచలన ప్రకటన

ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ ఐజీ పి. సుందర్ రాజ్ సంచలన ప్రకటన చేశారు. ఇన్ఫార్మర్ల పేరుతో గ్రామస్తులను హత్య చేస్తున్న ఘటనపై మావోయిస్టు నక్సలైట్ల మధ్య విభేదాలు ఏర్పడ్డాయని బస్తర్ ఐజీ ప్రకటన జారీ చేసినట్లు ఛత్తీస్ గఢ్ మీడియా సంస్థలు కొన్ని నివేదించాయి. దరిమిలా సొంత కమాండర్ నే మావోలు చంపేసినట్లు ఆయన పేర్కొన్నారని ఆయా వార్తా కథనాల సారాంశం.

గంగళూరు ఏరియా కమిటీ కమాండర్ విజ్జా మొడియం అలియాస్ భద్రు (43) సహచర నక్సలైట్ల చేతుల్లోనే హత్యకు గురైనట్లు, ఈ సంఘటనను బస్తర్ ఐజీ వెల్లడించినట్లు కూడా ఛత్తీస్ గఢ్ మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి. రూ. 8.00 లక్షల నగదు రివార్డు గల నక్సల్ నేత విజ్జా మొడియాన్ని హత్య చేసిన తర్వాత అతని డెడ్ బాడీని బంధువులకు అప్పగించారని, అతని సొంత గ్రామమైన మాంకెలిలో దహనం చేశారని ఆయా మీడియా సంస్థల కథనం.

బీజాపూర్ జిల్లాలో ఇటీవల ఇన్ఫార్మర్ల నెపంతో స్థానిక ప్రజలను కాల్చి చంపుతున్న వరుస ఘటనలపై మావోయిస్టు దళాల మధ్య విభేదాలు నెలకొన్నాయని బస్తర్ ఐజీ చెబుతున్నారు. పదిహేనేళ్లుగా విజ్జా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నాడని, అమాయక గ్రామస్తుల హత్యలపై కలత చెందిన సహచర మావోయిస్టులే అతన్ని కాల్చి చంపారని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ఓ ప్రకటన విడుదల చేసినట్లు ఛత్తీస్ గఢ్ మీడియా వర్గాలు వార్త కథనాలు వెలువరించాయి.

గురువారం జరిగినట్లు పేర్కొంటున్న ఆయా ఘటనపై బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ఏమంటున్నారో దిగువన గల లింక్ లో చూడవచ్చు.

ఫొటో: మావోయిస్టు కమాండర్ విజ్జా (ఫైల్)

Popular Articles