Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

వావ్…! ‘సినిమా’ చూపిస్తున్న కాలేజీ యాడ్ క్రియేటివిటీ!

యాడ్, అదేనండీ… అడ్వర్టయిజ్మెంట్ లేదా ప్రకటన. వ్యాపార పోటీ ప్రపంచంలో తట్టుకుని నిలబడాలంటే దాని తీరుతెన్నులు ఎలా ఉండాలి? చూడగానే ఆకట్టుకునేలా, ఆకర్షణీయంగా ఉండాలి. తమ ఉత్పత్తిలో గాని, సంస్థలోగాని వాస్తవిక సత్తా ఉన్నా, లేకున్నా చూసేవారిని యాడ్ అలా కట్టి పడేయాలి అంతే…

ఇక ప్రయివేట్ విద్యారంగంలో ఈ యాడ్ల గురించి కొత్తగా చెప్పుకునేది కూడా ఏమీ లేదు. ఏటేటా విద్యార్థులను ఆకట్టుకోవడానికి ఒకటీ, ఒకటీ, ఒకటీ.., రెండూ, రెండూ, రెండూ… అంటూ లక్ష్మీ గణపతీ ఫిలింస్… తరహాలో చెవులు చిల్లులు పడేలా, గుండె వీక్ గా కుప్పకూలిపోయేలా కాదు లెండి.

యాడ్ అంటే కాస్త క్రియేటివిటీ, అంటే… సృజనాత్మకత ఉండాలి. తమ కళాశాలలో గల సౌకర్యాల గురించి గాని, ఆ కళాశాల సాధించిన గొప్ప ఫలితాల గురించిగాని చెప్పుకుంటూ ప్రకటనల ద్వారా ఊదరగొట్టాల్సిన అవసరమే లేదు. కావాలంటే దిగువన గల కొత్త తరహా యాడ్స్ ను పరిశీలనగా చూడండి.

చదువుకునే కుర్రాళ్లకు తమ ప్రకటనల్లో తెలుగు సినిమాలను చూపించేస్తున్నారు. ఓ రకంగా ప్రేరణగా పేర్కొంటున్నారు. కరీంనగర్ లోని ఓ ప్రయివేట్ డిగ్రీ కళాశాల జనంలోకి వదిలిన ‘యాడ్’ బాణాలివి. ‘బాహుబలి, సరిలేరు నీకెవ్వరు, భరత్ అనే నేను, ఉన్నది ఒకటే జిందగీ’ సినిమా టైటిల్స్ ను ఉపయోగించుకుని తయారు చేసిన ప్రకటనలివి.

చూస్తుంటే ప్రకటనలు కాస్త వెరయిటీగానే ఉన్నాయి. ఆకర్షించే విధంగానూ ఉన్నాయి. అందువల్ల చెప్పొచ్చేదేమిటంటే.., మీ ప్రకటనలకు విద్యార్థులు ‘ఫిదా’ అయి మీ కళాశాలలో చేరి గెలుపును ఆస్వాదించి, లక్ష్యాన్ని సాధించేందుకు ముందడుగు వేస్తూ, అందరూ మీ కళాశాలలోనే కలుస్తారనే ఆశిద్దాం. మీ క్రియేటివిటీకి సార్థకత చేకూరాలని కోరుకుందాం.

Popular Articles