Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

చెబితే చెవికెక్కలేదు… ఎలా ఉందిప్పుడు?

పాపం ,
పుడమి
గుసగుసలాడనే
ఆడింది;
నీ
చెవికెక్కలేదు.

భూమి
మాట్లాడింది;
నువ్వు
వినలేదు.

అవని
ఆర్త నాదాలూ పెట్టింది;
నోరు నొక్కేశావ్.

అప్పుడే
పుట్టాను నేను.

నీ
నిద్దర
వదిలించడానికి
పుట్టాను నేను ;
నిన్ను దండించడానికి
జన్మించలేదు
నేను.

భూమి కేకలు పెట్టింది ,
సాయం కోరింది….

వరదలు పోటెత్తితే
నీ కంటికి
ఆనలేదు.

అడవులు దగ్ధమై
బూడిదయితే
నువ్వు
బేఖాతరు చేశావు.

పెనుతుఫానులూ ,
ప్రచండ
వాయు భీభత్సాలూ
నువ్వు
లెక్క చెయ్యకనేపోతివి.

నువ్వు జారవిడిచిన
చెత్త
అపార జలధినే
మురికి చేస్తే ,
తట్టుకోలేని
జలచరాలు పాపం
సామూహికంగా
చచ్చి మిగిలితే
నీ కంటికి
ఆనలేదు ;
కరవులు
విలయం సృష్టిస్తే ,
హిమఖండాలు కరిగి
ఏరులైతే ,
అప్పుడైనా
నువ్వు
నేల తల్లి
నెనరున చెప్పే హితం
తలకెక్కించుకోలేదు.

ఎడ తెగని రణాలూ,
అమ్మ అవని ని
చుట్టు ముడుతున్న
హానికారక
ప్రసరణాలూ,
అంతు కానరాని
దురాశ ,
నువ్వు
పట్టించుకోనే లేదు.

నిర్దయగా
హతులౌతున్న
నిర్భాగ్యుల గణాంకాలు
నీకవసరమే లేక పోయె.

ద్వేషం కారు చిచ్చు గా
కమ్ముకుంటుంటే
నీ
బ్రతుకు
మారక నే పోయె.

భూమి
జారీ చేసే హెచ్చరికల
కంటే
నీకు నీ
ఐఫోన్ ల మార్పిడే
ప్రధానంగా తోచె.

అందుకే
ఈ దారుణ సంధ్యన
నా అవతరణం.

ప్రపంచం మొత్తం
పరుగు మానేసి
పట్టాల మీద
నిలబడేట్టు చేశాను.

నాకేసి
చెవులు రిక్కించి
మరీ వినేట్టు
కట్టేశాను.

వస్తుజాలంపైని
వ్యామోహం
జారి పోయి
నువ్వొక
ఆశ్రితుడివై
మిగిలిపోయేలా
మార్చాను.

ఎలా ఉందిప్పుడు ?

నీ హింసను
మూగగా నేను
భరించిన
నా రోదన సాంద్రత
ఎరుకలోకొస్తున్నట్టేనా ?

నీ ఊపిరి
కోసం నువ్వు
కొటుకు లాడుతున్నట్టేనని
తెలుస్తూందా ?

నువ్వు జరిపిన
దహనాలకు
జవాబుగా
నీకు
జ్వరం తెప్పిస్తున్నాను.

నా ఊపిరితిత్తులు
ఖరాబు చేసిందానికి
ప్రతిగా
నీశ్వాస కోశాన్ని
ఉక్కిరి బిక్కిరి లోకి
నెడుతున్నాను.

నీ సత్తువ యావత్తూ
నువ్వు
నా సారం సర్వాన్నీ హరించిన
దానికి ప్రతి సవాలు.

పుడమినీ,
తన పరివేదననూ
విస్మరించి
నువ్వు
మునిగిన సౌఖ్యాలూ,
విహారాలు
మొత్తం
నేను లాగేసుకున్నాను.

నీ గమనం సర్వం
సంక్లిష్టమై మిగిలిన
ఈతరుణాన
నీల గగనం స్వచ్ఛంగా
వెలుగుతూంది.

కర్మాగారాల విరామంతో
పవనం
కాలుష్య రహితమై
సేదతీరుతూంది.

నదీ జలాలు
స్వచ్ఛమై మెరుస్తున్నాయి.
బ్రతుకులో ప్రాధాన్యాలు
పునస్సమీక్షించుకో
ఈ వ్యవధి లో.

మళ్లీ చెబుతున్నాను
నిన్ను శిక్షించడానికి కాదు
నేనొచ్చింది ;
నీ నిద్దర
వదిలించడానికే.

విలయం
ముగిశాక ,
నేను
కనుమరుగై పోయాక ,
ఇప్పటి
ఈక్షణాలు గుర్తుంచుకో.

నీ ఆత్మనూ, ఆపైన
భూమి హితవచనమూ
ఆలకించు.

భూతలాన్ని
కల్మషపు దిబ్బ
చెయ్యకు..
జగడాలకు స్వస్తి చెప్పు;
సాటి మనిషికింత
ప్రేమ పంచు.
వస్తువుల మాయలో
పడకు.

భూమినీ
ప్రాణికోటినీ
పట్టించుకో.

సృష్టి కర్త కేసి
వినమ్రంగా చూడు.

ఎవరికి తెలుసు ,
ఈసారి నే
మళ్లీ వస్తే
ఇంకింత
బలీయమై
వొస్తానేమో…!!!

✍️ సం: కరోనా వైరస్
( ఒక స్పెయిన్ పౌరుడి కవిత)

(వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్న ఈ కవిత ఒరిజనల్ రచయితకు ధన్యవాదాలతో…)

Popular Articles