Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

యశోద హాస్పిటల్స్ WELCOMES YOU! వెడతారా!?

స్వాగతం… సుస్వాగతం… కాస్త ఇంగ్లీషులో చెప్పాలంటే వెల్ కమ్… అంటుంటాం. ఎవరైనా ఇంట్లోకి వస్తుంటే వారిని ఆహ్వానిస్తున్నట్లు మెయిన్ డోర్ వద్ద ‘వెల్ కమ్’ మ్యాట్లు వేస్తుంటారు. పెళ్లిళ్లు, పేరంటాల్లో, ఇతరత్రా శుభకార్యాల్లో ‘స్వాగతం… సుస్వాగతం’ అంటూ ఫ్లెక్సీల ద్వారా ఆహ్వానిస్తుంటాం. మీ రాక మాకు సంతోషకరం అనే భావనకు అర్థంగా స్వాగతం, సుస్వాగతం అనే పదాలతో కూడిన వాక్యాన్ని సందర్భోచితంగా ఎక్కువగా వాడుతుంటారు.

యశోద హాస్పిటల్స్ ఓ ప్రముఖ పత్రికలో ఇచ్చుకున్న ప్రకటన ఇదే!

కానీ సికింద్రాబాద్ యశోదా హాస్పిటల్స్ యాజమాన్యం కూడా ప్రజలకు స్వాగతం పలుకుతోంది. ఇందుకు సంబంధించి ప్రముఖ తెలుగు పత్రికలో ఓ వాణిజ్య ప్రకటనను విడుదల చేసింది. తమ ఆసుపత్రికి చెందిన ఆరుగురు ప్రముఖ డాక్టర్ల ఫొటోలతో కూడిన ఈ ప్రకటన చర్చనీయాంశమే. ఎందుకంటే…?

ఆసుపత్రికి వెళ్లాలని, ఆ పరిస్థితి రావాలని ఎవరూ కోరుకోరు. ఏదేని జబ్బున పడి అనివార్యంగా ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తే ‘మళ్లీ వస్తాం’ అని కూడా స్వస్థత చేకూరిన తర్వాత పేషెంట్లు కనీసం డాక్టర్ కు కూడా చెప్పరు. ఇది సెంటిమెంట్. ప్రమాదకర జబ్బుల నుంచి నయమైన పేషెంట్లు డిశ్చార్జి అయిన సందర్భంగా, వారి సంబంధీకులు కొందరైతే ఆసుపత్రుల ముందు కొబ్బరికాయలు కూడా కొడుతుంటారు. మళ్లీ ఆసుపత్రి పాలు కాకుండా కాపాడాలని తమ ఆరాధ్య దైవాలను వేడుకుంటూ ఈ చర్యకు పాల్పడుతుంటారు.

కానీ వ్యాపార ధోరణిలో అడ్వర్టయిజ్ మెంట్ పరంగా ‘సరికొత్త ట్రెండ్’కు యశోద హాస్పిటల్స్ తెరలేపిందనే చెప్పాలి. అందుకే కాబోలు ప్రజలకు… అంటే పేషెంట్లకు స్వాగతం పలుకుతోంది. అయినా ఆసుపత్రికి స్వాగతమేంటో…? మరీ విచిత్రం కాకపోతే…? ఇంతకీ ఈ స్వాగత ప్రకటన పేషెంట్ల కోసమా? ప్రకటనలోని ఆరుగురు డాక్టర్ల కోసమా? అనే సందేహం కూడా కలగవచ్చు. డాక్టర్ల కోసమైతే ఖచ్చితంగా కాకపోవచ్చు. ఎందుకంటే వీళ్లు ‘ఆన్ కాల్’ డాక్టర్లు కాదు. ఆసుపత్రికే చెందిన సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్ స్పెషలిస్టులు. కాబట్టి ఈ స్వాగత ప్రకటన ఖచ్చితంగా ‘పేషెంట్ల’ కోసమేనని భావించవచ్చు. అందువల్ల చెప్పేదేమింటంటే…
‘YASHODA HOSPITALS SECUNDERABAD WELCOMES YOU’
వెడతారా మరి!

(ముఖ్య గమనిక: యశోద హాస్పిటల్స్ సేవలనుగాని, దాని సమర్ధతనుగాని సంశయించే వార్తా కథనం కాదిది. ‘స్వాగత ప్రకటన’లోని ఔచిత్యాన్ని ప్రశ్నించడం మాత్రమే)

Popular Articles