ఛత్తీస్ గఢ్ కు చెందిన 86 మంది మావోయిస్టు పార్టీ నక్సలైట్లు తెలంగాణా పోలీసుల ముందు శనివారం లొంగిపోయారు. భద్రాద్రి కొత్తగూడెంలోని పోలీస్ బెటాలియన్ ఆఫీసులో మల్టీ జోన్ -1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ముందు ఆయా సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయినవారిలో 20 మంది మహిళా నక్సల్స్ కూడా ఉన్నారు.
జనజీవన స్రవంతిలో కలిసిన మొత్తం నక్సలైట్లలో 81 మంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఐదుగురు ములుగు జిల్లా పోలీసుల కృషితో లొంగిపోయారు. వీరిలో ఏరియా కమిట మెంబర్లు 4, పార్టీ సభ్యులు నలుగురు, మిలీషియా సభ్యులు 27, మిలీషియా కమాండర్ 1, కమిటీ సభ్యులు 8, డీఏకెఎంఎస్ సభ్యులు 20, సీఎన్ఎంలు 13, జీఆర్డీలు 9 మంది చొప్పున ఉన్నారు. ఆయా నక్సలైట్లు ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్, పూజారి కాంకేర్ తదితర ప్రాంతాలకు చెందినవారే.
తెలంగాణా ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ చేయూత’ కార్యక్రమానికి ఆకర్షితులై మావోయిస్టు నక్సల్స్ లొంగిపోయినట్లు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. లొంగిపోయిన నక్సలైట్లకు తక్షణ పునరావాస చర్యల్లో భాగంగా ఒక్కొక్కరికి రూ. 25 వేల నగదును అందిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణా ప్రాంతానికి చెందిన పెద్ద నాయకులు జనజీవన స్రవంతిలో కలిసినట్లయితే వారికి ప్రత్యేక నగదు, ఇతర పునరావాస సదుపాయాలను కల్పించడానికి పోలీసు శాఖ కృషి చేస్తుందని ఐజీ ప్రకటించారు.