Top 5 This Week

Related Posts

నక్సల్స్ క్యూ: మరో 71 మంది మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్ గఢ్: మావోయిస్ట్ పార్టీకి చెందిన మరో 71 మంది నక్సలైట్లు ఆదివారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్, నారాయణ్ పూర్ జిల్లాలకు చెందిన డివిజన్ కమిటీల నాయకులు, పలువురు ముఖ్యులు సహా మొత్తం 71 మంది నక్సలైట్లు ప్రభుత్వానికి సరెండరయ్యారు. కాంకేర్ ప్రాంతం నుంచి 50 మంది, నారాయణ్ పూర్ జిల్లాలో 21 మంది లొంగిపోగా, వీరిలో 13 మంది మహిళా నక్సల్స్ ఉన్నారు. లొంగిపోయిన ఆయా మొత్తం నక్సలైట్లు 18 ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించడం గమనార్హం.

ఇటీవల పార్టీకి చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను సహా 61 మంది మావోయిస్టులు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముందు తుపాకులు అప్పగించి లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనానంతరం మరో కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న 208 మంది సహచరులతో ఛత్తీస్ గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి ముందు లొంగిపోయారు. తాజాగా 71 మంది నక్సలైట్లు కాంకేర్, నారాయణ్ పూర్ జిల్లాల నుంచి ప్రభుత్వానికి లొంగిపోయారు. దీంతో ఛత్తీస్ గఢ్ అడవుల నుంచి లొంగుబాటలో పయనించేందుకు మావోయిస్టులు క్యూ కడుతున్నట్లు కనిపిస్తోంది.

Popular Articles