హైదరాబాద్: మావోయిస్ట్ పార్టీకి చెందిన 41 మంది నక్సలైట్లు తెలంగాణా డీజీపీ బి. శివధర్ రెడ్డి ఎదుట శుక్రవారం లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో కామారెడ్డి మండలం ఆరెపల్లికి చెందిన మావోయిస్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుుడు, డివిజనల్ కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి కూడా ఉన్నారు. ఈమేరకు మీడియా సమావేశంలో డీజీపీ శివధర్ రెడ్డి లొంగుబాటను ఆశ్రయించిన నక్సల్స్ వివరాలను వెల్లడించారు.
లొంగిపోయివారిలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ కు చెందిన 11 మంది, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు, సెకండ్ సెంట్రల్ రీజనల్ కమిటీ కమాండర్ సహా ఐదుగురు, చర్ల-శబరి ఏరియా కమిటీకి చెందిన నలుగురు, ప్లాటూన్-33 సౌత్ సబ్ జోనల్ బ్యూరో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన ఐదుగురు, సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీకి చెందిన తొమ్మిది మంది, దర్భా డివిజన్ కమిటీకి చెందిన నలుగురు, గంగలూరు ఏరియా కమిటీకి చెందిన ఒకరు చొప్పన ఉన్నారు. మొత్తం 41 మంది నక్సలైట్లలో ఆరుగురు డివిజనల్ కమిటీ నాయకులు, 12 మంది ఏరియా కమిటీ షభ్యులు, 23 మంది ప్లాటూన్ మెంబర్లు ఉన్నారు.
లొంగిపోయిన ఆయా నక్సలైట్లు మొత్తం 24 తుపాకులను, 733 తుపాకీ తూటాలను, ఎనిమిది బీజీఎల్ షెల్స్ ను పోలీసులకు స్వాధీనం చేశారు. అప్పగించిన ఆయుధాల్లో ఒక ఇన్సాస్ ఎల్ఎంజీ, మూడు ఏకే-47, ఏడు ఇన్సాన్, అయిదు ఎస్ఎల్ఆఱ్ రైఫిల్స్, ఒక బీజీఎల్, నాలుగు .303, ఒక సింగిల్ షాట్ రైఫిల్, రెండు ఎయిర్ గన్ లు ఉన్నాయి. వీటికి సంబంధించిన మొత్తం 42 మ్యాగ్జిన్లను కూడా స్వాధీనపరిచారు.

ఈ సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాానా ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాలకు, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మావోయిస్టు నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలిశారని చెప్పారు. ప్రభుత్వ పునరావాస విధానానికి అనుగుణంగా డివిజనల్ కమిటీ సభ్యులకు రూ. 5.00 లక్షలు, ఏరియా కమిటీ సభ్యులకు రూ. 4.00 లక్షలు, పార్టీ సభ్యులకు రూ. లక్ష చొప్పున నగదు రివార్డును అందజేయనున్నట్లు చెప్పారు. లొంగుబాటలో పయనించే నక్సలైట్లకు ప్రభుత్వ పరంగా అన్నివిధాల సహాయ, సహకారాలను అందిస్తామని చెప్పారు. నక్సలైట్ల లొంగుబాట్లకు సంబంధించి డీజీపీ శివధర్ రెడ్డి విడుదల చేసిన పత్రికా ప్రకటనను దిగువన గల పీడీఎఫ్ ఫైల్ లో చూడవచ్చు.

