భువనేశ్వర్: ఛత్తీస్ గఢ్ కు చెందిన 22 మంది మావోయిస్ట్ పార్టీ నక్సలైట్లు ఒడిషా డీజీపీ వై.బి. ఖురానియా ముందు మంగళవారం లొంగిపోయారు. లొంగిపోయినవారిలో ఒక డివిజనల్ కమిటీ సభ్యుడు, ఆరుగురు ఏరియా కమిటీ సభ్యులు, 15 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. మూడు AK-47 రైఫిల్స్, ఒక INSAS రైఫిల్, ఐదు 303 రైఫిల్స్, పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రి, జిలెటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, 13 టిఫిన్ బాంబులను లొంగిపోయిన నక్సల్స్ ఈ సందర్భంగా పోలీసులకు అప్పగించారు. ఈ నక్సల్స్ పై మొత్తం రూ. 2.18 కోట్ల నగదు రివార్డు ఉన్నట్లు డీజీపీ వై.బి. ఖురానియా మీడియాకు వెల్లడించారు.
జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులకు ప్రభుత్వం పునరావాస సహాయాన్ని అందిస్తుందని డీజీపీ చెప్పారు. లొంగిపోయినవారిపై ప్రకటించిన నగదు రివార్డు మొత్తాన్ని వారికే చెల్లిస్తామని, ఆయుధాలతో లొంగిపోయినవారికి రూ. 4.00 లక్షలతోపాటు, ఇతరత్రా ఆమోదయోగ్య భత్యాలు అందుతాయని చెప్పారు.అంతేగాక అంత్యోదయ పథకం కింద గృహ నిర్మాణానికి కూడా లొంగిపోయిన నక్సల్స్ అర్హతను కలిగి ఉంటారని చెప్పారు. లొంగుబాటను ఎంచుకున్న నక్సల్స్ ను స్వాగతిస్తున్నట్లు డీజీపీ ఖురానియా ఈ సందర్బంగా పేర్కొన్నారు. కాగా లొంగిపోయిన నక్సల్స్ ఛత్తీస్ గఢ్ లోని సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాలకు చెందినవారు కావడం గమనార్హం.
ఇన్ పుట్స్, ఫొటో: O TV సౌజన్యం..

