పొరుగున గల ఛత్తీస్ గఢ్ అడవుల్లో నక్సల్స్, పోలీసుల మధ్య మరోసారి భీకర పోరు జరుగుతోంది. ఇరువర్గాల మధ్య గురువారం ఉదయం ఏడు గంటల నుంచి జరుగుతున్న భారీ ఎదురుకాల్పుల ఘటనలో 20 మంది మావోయిస్టు నక్సల్స్, మరో జవాన్ మరణించినట్లు అధికార వర్గాలు ధ్రువీకరించాయి. దంతెవాడ-బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లోని గంగలూరు అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.
గంగలూరు సమీపంలోని ఆండ్రి అడవుల్లో మావోయిస్టులు పెద్ద సంఖ్యలో ఉన్నారనే సమాచారంతో తమ బలగాలను పంపినట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ స్థానిక మీడియాకు చెప్పారు. ఘటనలో ఈ ఉదయం ఇద్దరు నక్సలైట్ల డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నామని, ఒక జవాన్ సైతం ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు చెప్పారు.
ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు తెలిపారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఎన్కౌంటర్ లో మరణించిన నక్సలైట్ల సంఖ్య 20కి పెరిగినట్లు తెలుస్తోంది. కాగా ఈ ఘటనలో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తును ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. తమ బలగాలు వెనక్కి వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు బీజాపూర్ ఎస్పీ చెప్పారు.