Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

విమానంలో మృత్యుంజయుడు రమేష్ విశ్వాస్ కుమార్

అహ్మదాబాద్ లో కుప్పకూలిన ఎయిరిండియా విమాన ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. ఈ ప్రమాద ఘటనలో విమానంలోని వారెవరూ బతికే ఛాన్సే లేదని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ చెప్పినట్లు ఓ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. విమాన ప్రమాదపు ఘటనలో ఇప్పటి వరకు 186 మంది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఉన్నట్లు బీజేపీ గుజరాత్ చీఫ్ ప్రకటించారు. విమానంలో 230 మంది ప్రయాణీకులు ఉండగా, 12 మంది ఫ్లయిట్ సిబ్బంది ఉన్నారు.

విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ రమేష్ విశ్వాస్ కుమార్, అతని ప్రయాణపు టికెట్

కాగా ఇంతటి తీవ్ర ప్రమాద ఘటనలో రమేష్ విశ్వాస్ కుమార్ అనే ప్రయాణీకుడు సురక్షితంగా బయటపడ్డారు. ఇతను 11ఏ సీటులో ప్రయాణించారు. ప్రమాద సమయంలో ఎమర్జెన్సీ గేటు నుంచి దూకి ప్రాణాలను రక్షించుకున్నారు. ఈ విషయాన్ని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. అయితే విమాన ప్రయాణ మృతుల సంఖ్యపై ఇప్పటివరకు ఖచ్చిత సమాచారమేదీ లేకపోవడం గమనార్హం. ఖచ్చిత సమాచారానికి కాస్త సమయం పడుతుందని విదేశాంగ శాఖ ప్రకటించింది.

అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణా, ఏపీ సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబునాయుడిలతోపాటు పలు రాష్ట్రాల సీఎంలు, పలువురు కేంద్ర మంత్రులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కాగా విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ సంస్థ కోటి రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటించింది. గాయపడినవారికి వైద్య చికిత్స అందిస్తామని, అవసరమైన సహాయాన్ని కూడా అందజేస్తామని ప్రకటించింది. కాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కు చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. అమిత్ షా వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఉన్నారు.

Popular Articles