Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

‘సత్తుపల్లి సైబర్ ఛీటింగ్ కేసు’లో 15 మంది అరెస్ట్!

పెనుబల్లి: ‘సత్తుపల్లి సైబర్ ఛీటింగ్’ కేసుగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఉదంతంలో పోలీసులు పలువురిని అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ‘రాజకీయ ఒత్తిళ్ల’ కారణంగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నట్లు ప్రచారంలో గల ఉడతనేని వికాస్, పోట్రు కళ్యాణ్ అనే ఇద్దరు ముఖ్య నిందితులు మినహా దాదాపు 15 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

సైబర్ నేరాలకు పాల్పడ్డారనే అభియోగాలపై పెనుబల్లి పోలీసులు గత నెల 24వ తేదీన బీఎన్ఎస్ చట్టంలోని 318(4),319(2),336(3),338,r/w 3(5) సెక్షన్ల కింద, 66-D ITA-2000-2008 యాక్ట్ ప్రకారం నమోదు చేసిన కేసులో ఐదుగురు వ్యక్తులను నిందితులుగా ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. వీరిలో ప్రధాన నిందితుడు, బీఆర్ఎస్ నాయకుడు పోట్రు ప్రవీణ్ ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

ఈ కేసులో ఐదో నిందితుడైన ఉడతనేని వికాస్ అధికార పార్టీకి చెందిన ఓ రాజకీయ నాయకుడి సమీప బంధువు. రెండో నిందితుడు పోట్రు కళ్యాణ్ సత్తుపల్లి పట్టణ బీజేపీ మాజీ అధ్యక్షుడు. వీరిద్దరి అరెస్టు అంశంలో పోలీసులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కేసులో కీలక నిందితులుగా వ్యాప్తిలోకి వచ్చిన ఉడతనేని వికాస్, పోట్రు కళ్యాణ్ మినహా పదిహేను మంది వరకు ఇతరులను నిందితుగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.

ఈ అరెస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను ఖమ్మం పోలీస్ కమిషన్ సునీల్ దత్ ఈ ఉదయం 10 గంటలకు పెనుబల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించనున్నారు.

Popular Articles