(వ్యాసకర్త : డా. తంగెళ్ళ శ్రీదేవిరెడ్డి)
గురుగుళ్ల నేతులు
గుమ్మడి కాయలు
తెత్తురే కురుమన్న నీ పూజకు….
కుమ్మరి కుండలు
మోదుగ దొప్పలు
తెత్తురే కురుమన్న నీ పూజకు….
అంటూ జానపదులు భక్తిగా పడుకునే పేదల దేవుడు కురుమూర్తి స్వామి!!
తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి పాలమూరు జిల్లా ఆత్మకూరు సంస్థానం పరిధిలో అమ్మాపురం వద్ద ప్రతి ఏటా కార్తిక మాసంలో జరిగే పేరిన్నికయిన జాతరల్లో కురుమూర్తి జాతర ఒకటి. ప్రభుత్వ పర్యవేక్షణ, రాజకీయ జోక్యం, ఇతర రాష్ట్రాల నుండి భక్తుల ఆగమనం, జాతర స్థాయిని తెలియజెప్తుంది..
ఏడు గుట్టలు:
శేషాద్రి….ఏకాద్రి….. కోటాద్రి …ఘనాద్రి…. భల్లూకాద్రి….పతగాద్రి….దేవతాద్రి….
అనే ఈ ఏడు కొండలు తెలంగాణ రాష్ట్రం, పూర్వ పాలమూరు జిల్లా, ఆత్మకూరు సమీపంలో అమ్మాపురం వద్ద వెలసి ఉన్నాయి.ఈ కొండల సమూహాన్ని ” ఆనందగిరులు” అంటారు.
శ్వేతాద్రి లేదా బొల్లిగట్టు,
ఏకాద్రి లేదా ఒంటిగట్టు,
కోటాద్రి లేదా కోటగట్టు,
ఘనాద్రి లేదా పెద్దగట్టు,
భల్లూకాద్రి లేదా ఎల్గులగట్టు,
పతగాద్రి లేదా చీపర్లగట్టు,
దేవతాద్రి లేదా దేవునిగట్టు. ఈ దేవరగట్టు మీద కాంచన గుహలో స్వామి కొలువై ఉంటాడు.
దేవతాద్రిని వ్యవహారంలో దేవరగట్టు అని పిలుస్తుంటారు. జానపదులు ద్యావరగట్టు అని పిలుస్తుంటారు.

వెంకన్న అవతారం:
దేవరగుట్ట పైభాగంలో మొదట్లో ఒక రాతిగుండు స్వామి వారి ప్రవేశ మార్గంగా ఉండేది. ప్రస్తుతం ఆధునీకరించారు. కురుమూర్తి, కురుమతి, కురుమన్న, అంటూ రకరకాలుగా పిలుచుకునే కురుమూర్తి స్వామి….సాక్షాత్తు ఆ వేంకటేశ్వరస్వామి అవతారంగా భక్తులు విశ్వసిస్తారు.
అఖండ దీపం:
ఆధ్యాత్మిక శోభతో ఈ గుట్టలు ప్రస్తుతం తెలంగాణ రాష్టానికి తలమానికమై విలసిల్లుతున్నాయి. కార్తీకమాసంలో జాతర సందర్బంగా ఇక్కడ గట్టు కొనభాగాన వెలిగించే దీపం అత్యంత మహిమాన్వితం అయినది.
” ఘనమైన నీ దీపం ఢిల్లీకి వేలుగాయే
” వంటి పాటలు
ఈ అఖండ జ్యోతిపై వెలువడి ఊరూరా వినిపిస్తున్నాయి.
చరిత్ర:
దేవస్థానం సా.శ. 1268 లేదా 1292 తర్వాత ప్రాంతములో గోన బుద్దారెడ్డి మిత్రుడైన ముక్కెర వంశ మూలపురుషుడు, రాజా గోపాలరెడ్డి నిర్మించినట్టుగా లభిస్తున్న చారిత్రక ఆధారాలు ద్వారా తెలుస్తున్నది. . కాగా గోపాలరెడ్డి హయాంలో ఆలయం పెద్దగా వెలుగు చూడలేదు.
గోపాలరెడ్డి కుమారుడు చిన గోపిరెడ్డి సా.శ.1363 ప్రాంతంలో తన పాలనలో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఆలయం అభివృద్ధి పెద్దగా కొనసాగలేదని తెలుస్తున్నది.
చిన గోపిరెడ్డి తర్వాత పాలనకు వచ్చిన చంద్రారెడ్డి ఆలయాన్ని అభివృద్ధి పరిచి ఆలయ నిర్మాతగా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. కాగా ఈ విషయమై లభిస్తున్న చరిత్ర కొంత గందరగోళానికి తావు ఇస్తున్నది. ఎందుకంటే 1350లో చంద్రారెడ్డి ఆలయాన్ని అభివృద్ధి పరిచినట్టుగా సంస్థానాలు గురించి సమగ్ర సమాచారం అందించిన తూమాటి దోణప్ప పేర్కొంటున్నారు. కాగా ఈ విషయమై విశ్లేషణ జరుపుకుంటే తండ్రి పాలనలోనే కుమారుడు తన ముద్రను చూపించి ఉండవచ్చు.
మూడవ అసఫ్ జాహి సికిందర్ జా (1803-1829),నాలుగవ అసఫ్ జాహి నాసిరుద్దవౌలా (1829-1857) ఇద్దరి పాలనలో మనుగడ సాగించిన ముక్కెర వంశ వారసుడు రాజా వెంకటరెడ్డి
1810–1840 సం. మధ్య కాలంలో ఆలయ అభివృద్ధికి విశేష కృషి సలిపినట్టుగా తెలుస్తున్నది. ఇక్కడి ఆంజనేయస్వామి ఆలయం ఇదే కాలంలో నిర్మితమైనట్టు భావిస్తున్నారు
తర్వాత నాల్గవ అసఫ్ జాహి నాసిరుద్దవౌలా పాలనా కాలం వాడయినా ముక్కెర వారసుడు రాజా సోమభూపాలరావు కొండపైకి మెట్లు నిర్మించాడు. ఏటా జాతర నిర్వహించే సాంప్రదాయం అమలులోకి తీసుకు వచ్చాడు.
ఆరవ అసఫ్ జాహి కాలంలో రాజా శ్రీ రాం భూపాల్ 1870-1878 మధ్య ప్రాంతంలో ఉద్దాల మండపం ఏర్పాటు చేశారు. ఉద్దాలు అనగా పాదరక్షలు అని అర్థం. ఇక్కడ నగారా బంగ్లా (నవత్ ఖాన బంగ్ల) వాద్యకారుల కోసం 1857-78 మధ్య కాలంలో నిర్మితమైనట్టు చెబుతున్నరు.. విశాలమైన ధర్మశాలను కూడా ఇదే కాలంలో నిర్మించినట్లు తెలుస్తున్నది సీతారామభూపాలుడే ఉత్సవాల సందర్భంగా నగారా బంగ్లాను ఉపయోగించేవారని కూడా తెలుస్తున్నది.
కురుమూర్తి అస్సలు పేరు కురుమతి అని పండితులు పేర్కొంటున్నారు. కురు అనగా ‘ చేయుట ‘ అని, మతి అనగా ‘తలుచుట ‘అని అర్థం. అంటే ఏది కోరినా చేసి పెట్టే తలంపు ఆ క్షేత్రానికి ఉన్నదని భావించవచ్చు. మొత్తానికి కాల క్రమంలో కురుమతి కురుమూర్తిగా చెప్పబడింది అని తెలుస్తున్నది. మూర్తీభవించిన రూపం అక్కడ కొలువైనది కాబట్టే ‘ కురుమూర్తి ‘ గా చెప్ప బడి ఉండవచ్చు.

కురుమూర్తిపై రచనలు:
కురుమూర్తి స్వామి గురించి బుక్కపట్టణం బుచ్చి వెంకటాచార్యులు,కపిలవాయి లింగమూర్తి, నరసింహ దీక్షితులు,వైద్యం వెంకటేశ్వరాచార్యులు వంటి కవి పండితులు తమ రచనలు అందించారు.
▪బుక్కపట్టణం బుచ్చి వెంకటాచార్యుల వారు 1854-61లో రచించిన ” శ్రీ ఉత్తర వెంకటాచల మహత్యం ” గ్రంథంలో కురుమూర్తి స్వామి వారి ప్రస్తావన ఉన్నది.
▪1850 వ సంవత్సరంలో అజకొల్లు శేషకవి
‘శ్రీ కురుమూర్తి క్షేత్రస్థల పురాణం’ పద్యం రూపంలో రచించాడు.
▪1851-1905 మధ్య కాలంలో కృష్ణమాచార్యులు వారు కురుమూర్తి స్వామి సుప్రభాతాలు రచించారు.
▪1878లో నరసింహ దీక్షితులు రచించిన చెంచుకథలో దుర్వాస దిలీప సంవాదం’ కథలో కురుమూర్తి స్వామి క్షేత్రానికి సంబంధించిన
ఇక్కడి ఏడుకొండల ప్రస్తావన లిఖించబడింది.
▪1959లో వి.రామకృష్ణయ్య కవి కురుమూర్తి స్వామి భజన కీర్తనలు వెలువరించారు.
▪ వైద్యం వెంకటేశ్వరాచార్యులు –
1979లో శ్రీ కురుమూర్తిగిరినిలయ – లక్ష్మి వెంకటేశ్వర సుప్రభాతం రచించారు.
1983 లో శ్రీ కురుమూర్తి శ్రీనివాస శతకం కంద పద్యాలుగా రచించారు.
1983లో ” తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో ‘శ్రీ కురుమూర్తి క్షేత్ర చరిత్రము” పరిశోధనాత్మక గ్రంధం రచించారు.
▪ బెల్లం సాయిలు కురుమూర్తిస్వామి భజన కీర్తనలు ప్రచురించారు.
▪ఉమ్మెత్తల నర్సింహమూర్తి కురుమూర్తి స్వామిని కీర్తించే అనేక జానపద గేయాలను సేకరించి ప్రచురించారు
▪ప్రస్తుతం స్వామి వారి గురించి ఈ తరం కవులు రచయితలు పాటలు పద్యాలు రచిస్తున్నారు. దృశ్య మాలికలు తయారు చేస్తున్నారు.
▪కురుమూర్తి ఆలయం గురించి ఎన్నో జానపద కథలు వ్యవహారంలో ఉన్నాయి.ఇవన్నీ తిరుపతి వేంకటేశ్వరస్వామి కుబేరుడి అప్పుల బాధను తట్టుకోలేక కురుమూర్తి గుట్టల్లోకి విశ్రాంతి కోసం వచ్చి…లక్ష్మీ సమేత తన ప్రతి రూపాన్ని గుట్టల్లో వదిలి , తిరిగి తిరుపతి వెళ్లిపోయాడని ఈ కథల సారాంశం.
స్థలపురాణం కూడా కురుమూర్తి స్వామి వెంకటేశ్వర అవతారంగా చెబుతున్నది. స్వామి స్వయంభూ అని కూడా చెబుతున్నది. ఈ క్రమంలో స్వామి వారి ఆనవాళ్లు కనుక్కుని పాలకులు గుడి కట్టి ఉండవచ్చు అని మనం భావించవచ్చు.
అమూక్తమాల్యదలో:
కురుమూర్తి అంటే వామనావతారం అని అర్థంలో కూడా మనం గమనించవచ్చు.వివరాల్లోకి వెళ్తే….
వామనుడే త్రివిక్రముడు. హిందూ పురాణాల ప్రకారం దశావతారాలలో ఐదవ అవతారం.
శ్రీకృష్ణ దేవరాయల వారి ఆముక్తమాల్యద మాలదాసరి కథలో శ్రీమహావిష్ణువును “కురుం గుడి నంబి ” అని సంబోధించాడు. మూడడుగుల నేలను బలి చక్రవర్తిని దానం అడుగుతాడు. ఒక పాదం భూమిపై మోపి, ఒక పాదం ఆకాశాన్ని ఆక్రమించి, మూడోపాదం బలిచక్రవర్తిని తొక్కడానికి ఉపయోగించాడు. ఇక్కడ మహా విష్ణువు వారిది అది చాలా పెద్ద పాదం. ఈ ప్రకారం కురుమూర్తిలో ఉద్దాలు పేరుతో పెద్ద పరిమాణంలో పాదరక్షలు తయారు చేయడం జరుగుతుంది. ఆ విష్ణుమూర్తి పెద్ద పాదం కథ అలా సాగుతూ సాగుతూ మరుగున పడిపోయింది. ఇది కురుమూర్తి వామనుడు కథ.
స్వామి ఉద్దాలోత్సవం:
కార్తీకమాసం బ్రహ్మోత్సవాలతో కురుమూర్తి జాతర ఆరంభం అవుతుంది. ఇందులో ” ఉద్దాలోత్సవం ” ప్రధాన ఘట్టం. ఈ ఉద్దాల ఉత్సవంలో స్వామివారి పాదుకలను కొత్త చేటలో ఉంచి ఉద్దాల మండపం వద్దకు తీసుకు వస్తారు. స్వామివారికి ఉద్దేశించిన పాదుకలను ఉద్దాలు అనడం ఆనవాయితీ.
ఈ నేపథ్యంలో కురుమూర్తి ఆలయంతో ఎరుకల కులస్తులకు దళితులకు విడదీయరాని అనుబంధం ఉన్నది.
▪పల్లమర్రి గ్రామానికి చెందిన మేదర కులస్తులు ప్రత్యేక చాటను తయారు చేస్తారు. దీపావళి అమావాస్య రోజు చాట తయారీ ప్రారంభించి ఉత్సవం నాటికి పూర్తి చేసి దళితులకు భక్తి శ్రద్దలతో అందజేస్తారు.
▪వడ్డెమాన్ గ్రామంలో దళితుల సమక్షంలో ఆవు చర్మంతో స్వామి వారి పాదుకలను దళితులే తయారు చేస్తారు.
దీపావళి అమావాస్య రోజు నుంచి వారం రోజుల పాటు నియమ నిష్ఠలతో ఉపావాస దీక్షలతో ఉద్ధాలు తయారు చేస్తారు. ఉత్సవాల సమయానికి చేటలో పాదుకలు ఉంచి ఊరేగింపుగా కురుమూర్తి దేవస్థానానికి తీసుకెళ్తారు. ఉద్దాల మండపంలో దళితులే అర్చకులుగా కొనసాగుతుంటారు.
సిగాలు / పూనకాలు :
ఉద్దాలోత్సవంలో ఉద్దాల ఊరేగింపు పవిత్రమైన గొప్ప వేడుక. ఈ సందర్బంగా భక్తుల సిగాలు / పూనకాలు… నృత్యాలు… పరవశిస్తూ తన్మయత్వంతో పెట్టే కేకలు… ఇక్కడ కన్నుల పండుగై కనిపిస్తాయి…..వినిపిస్తాయి. ఊరేగింపు తర్వాత పాదుకలను మండపంలో ఉంచుతారు. ఈ ఉద్దాల మండపాన్ని
1878లో రాజా శ్రీరాం భూపాల్ నిర్మించగా, 1999లో మరమ్మత్తులు చేశారు.
ఉద్దాలతో వీపుపై పాదుకలతో కొట్టించుకుంటే పాపాలు సమస్యలు కష్టాలు రోగాలు అడ్డంకులు తొలగి పోతాయని భక్తుల నమ్మకం.
తలియకుండ ఆచారం:
కురుమూర్తి స్వామి సన్నిధిలోని మరో ఆచారం తలియకుండ ఆచారం. ఇది మట్టికుండ. అప్పంపల్లికి చెందిన కుమ్మరులు ప్రత్యేకంగా ఈ కుండని నియమ నిష్ఠలతో తయారుచేస్తరు. అనుకున్న సమయానికి ‘తలియకుండ’ ను ఆలయ లాంచనాలతో…
ఉద్దాల మండపం వద్దకు చేరుస్తారు.
నెల్లి వంశస్థులు ప్రత్యేక పూజలు పూజలు నిర్వహిస్తారు.
బసివినిల భర్తగా:
ప్రస్తుతం సంఘ సంస్కరణల నేపథ్యలో ఈ ప్రాంతంలో నెలకొని ఉన్న ‘ బసివిని ‘ ఆచారం తగ్గిపోయింది. కాగా ఒకప్పుడు మాదిగ తెగలు బసివి ఆచారం పాటిస్తూ కురుమూర్తి జాతర సమయంలో… తమ ఆడపిల్లలకు కురుమన్న పేరిట మాల దాసరి సమక్షంలో పెళ్ళి జరిపించేవారు. కురుమన్నను మొగుడిగా నిర్ణయించేవారు.
దాసంగం:
స్వామి వారికీ పెట్టే నైవేద్యాన్ని ఇక్కడ ‘ దాసంగం ‘ అంటారు. స్వామి వారికి దాసులై సమర్పించుకునే ఈ దాసంగంలో ‘అన్నం – పచ్చి పులుసు ‘లేదా ‘ పులగం ‘ ప్రధానంగా ఉంటాయి. పులగం అంటే బెల్లంతో వండే అన్నం.
ఇలవేల్పుగా:
ముక్కెర వంశ మూల స్తంభం గోపాల్ రెడ్డి కాలం నుండి, తెలంగాణ సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యే వరకు తమదైన అధికారాన్ని కాపాడుకుంటూ వచ్చిన రాణి భాగ్యలక్ష్మీ దేవి (1948) దాక మొత్తం 28 తరాల వారు అందరూ ‘కురుమూర్తి స్వామి’ ఆలయ అభివృద్ధికి కృషి చేసారు. ముఖ్యంగా స్వామి వారిని తమ ఇలవేల్పుగా ముక్కెర వంశస్తులు మాత్రమే కాదు, ఆ ప్రాంత ప్రజలు అందరూ కూడా కురుమూర్తిని తమ ఇలవేల్పుగా ఆరాధిస్తారు.

తిరుపతి కురుమతి మధ్య పోలికలు:
తిరుపతికి కురుమూర్తి ఆలయాలకు మధ్య స్పషమైన పోలికలు ఉన్నాయి. ప్రధానంగా తిరుమలలో మాదిరి ఇక్కడా వినాయకుడి విగ్రహం లేదు. ఏడు కొండల మధ్య దేవాలయం ఉంది. తిరుమల మెట్ల దారిపై శ్రీపాద చిహ్నాలు ఉన్నట్లుగానే ఇక్కడా ఉన్నాయి. కురుమూర్తి దర్శనానికి వెళ్తున్నప్పుడు తిరుపతి లో ఉన్నట్టు మోకాళ్ళ గుండు కూడా ఉన్నది. అలిపిరి మండపం పోలికలతో ఇక్కడ ఉద్దాల మండపం ఉన్నది ఈ ఆలయం ఇన్ని విదాలుగా తిరుమల శ్రీ వేంకటేశ్వరుని ఆలయాన్ని పోలి వుండాటానికి చారిత్రక కారణం విశ్లేషిస్తే…. ముక్కెర వంశస్తులు చంద్రగిరి వాస్తవ్యులు కావడం వలన, అక్కడి తిరుపతి పోలికలతో ఇక్కడ సరైన చోట ఆలయం నిర్మించుకుని ఉండవచ్చు. పురాణం ప్రకారం ఆలోచిస్తే వేంకటేశ్వరుడు తిరుపతిని పోలిన ప్రదేశాన్ని ఎంచుకుని ఉండవచ్చు. మొత్తానికి ఈ కురుమూర్తి క్షేత్రాన్ని పాలమూరు తిరుపతిగా కూడా పిలుస్తారు. పేదల తిరుపతి అనికూడా అంటారు.
సంస్థానాధీశుల ఆభరణాలు:
సంస్థానాధీశులు స్వామి వారికి 15వ శతాబ్దంలో బంగారు ఆభరణాలను సమర్పించారు.వీటిలో శంఖుచక్షికాలు, కిరీటం, మకర కుందనాలు, భుజ కిరీటాలతో సహా వివిధ ఆభరణాలు ఉన్నాయి.. నాటి నుండి నేటి వరకు ఆ ఆభరణాలను స్వామివారికి ఉత్సవాల సందర్భంగా అలంకరించడం ఆనవాయితీగా వస్తున్నది. మొదట్లో ఆభరణాలను
సంస్థానాధీశుల బంగ్లాలోనే ఉంచేవారు. ఉత్సవాల సందర్భంగా రాజభవనం ముందున్న కొలనులో ఆభరణాలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు జరిపించి…. ఏనుగు అంబారీపై స్వామివారి అలంకరణలను ఊరేగింపుగా వేడుకగా తీసుకు వెళ్ళి స్వామివారికి అలంకరించేవారు.
దివ్యవాహన సేవలు:
పది రోజుల పాటుగా వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలలో భాగంగా దేవీ సమేత స్వామి వారి ఉత్సవ మూర్తిని వివిధ వాహనాలపై ఊరేగిస్తారు.
మొదటిరోజు – మయూర వాహనసేవ
రెండవరోజు – హంస వాహనసేవ
మూడవరోజు – శేషవాహన సేవ
నాలుగవరోజు – గజవాహనసేవ
ఐదవరోజు – అశ్వ వాహన సేవ
ఆరవరోజు – హనుమద్వాహనసేవ
ఏడవరోజు – గరుడ వాహనసేవ
తర్వాత పుష్పయాగం ప్రత్యేక పూజలు ఉంటాయి.
దేవాదాయ శాఖలో:
1968లో కురుమూర్తి ఆలయం రాష్ట్ర దేవాదాయ శాఖలో విలీనమైంది. ఫలితంగా 1976 నుంచి ఆభరణాలను ఆత్మకూరు బ్యాంకులోని ప్రత్యేక లాకర్‌లో భద్రపరుస్తున్నారు . ఉత్సవాల సందర్భంగా నేటికిని ముక్కెర వంశస్థులు విచ్చేసి ఆభరణాల అలంకరణోత్సవంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు
కురుమూర్తి స్వామి మహిమలు గురించి అనేక కథనాలు జనుల నోళ్ళల్లో వినబడుతుంటాయి. వివిధ నమ్మకాలను భక్తులు పాటిస్తుంటారు.
నమో నమః~~~~~~~~~
ఆధారాలు :
ఆంధ్రసంస్థానాలు – సాహిత్యం
పాలమూరు జిల్లా సంస్థానాలు
తెలంగాణ తీర్థయాత్ర

